భారతదేశంలో మిగితా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం, కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే, కొలువులే కొలమానంగా తొలినుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలను లెక్కచేయకుండా, ప్రాణాలను పణంగాపెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి. అది వారి హక్కు కూడా. యేండ్లకేండ్లు కుటుంబాలకు దూరంగా, అర్ధాకలితో, 5 రూపాయల భోజనం చేస్తూ, అగ్గి పెట్టే అంత సైజు గదిలో ఉంటూ, అప్పులుచేస్తూ పోటీ పరీక్షలకు ప్రాణం పెట్టి చదివే నిరుద్యోగులు, తమ ఉద్యోగ కలలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశని, అసంతృప్తిని, ఆందోళనని, భయాన్ని, దయనీయస్థితిని అర్థం చేసుకొవాలి.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యోగాల భర్తీని వెంటనే అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రజాప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండరు అనేది ఒక సంచలనం. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలన్నీ శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బందీగ జాబ్ క్యాలెండరు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టిజిపిఎస్‌సి చైర్మన్ పదవీకాలం పూర్తికాకముందే కొత్త ఛైర్మన్‌ని నియమించడం మంచి పరిణామం. కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థలకు విముక్తి కల్పించి, తల్లిదండ్రులకు లక్షల రూపాయల కోచింగ్ ఫీజుభారం తగ్గించేలా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత జాబ్ క్యాలెండరు అమలుకు ముందే ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ఖరీదైనా కోచింగ్‌ని ఉచితంగా అందించాలి.
కాంగ్రెస్ అగ్రనాయకుడైనా రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చి నిరుద్యోగుల బాధలను కళ్లారాచూసి చలించిపోయి సంవత్సరం తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండరు, 25,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్‌సి, 4000 రూపాయల నిరుద్యోగ భృతి, పరీక్ష ఫీజులు వసూలు చేయమని, లైబ్రరీలని అభివృద్ధి చేస్తామని, పరీక్ష పరీక్షకి తగినంత సమయం అంటూ అనేక హామీలని ఆయన ఇచ్చారు. ఇగ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల పండగే అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కేవలం 12 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని, 2 లక్షల ఉద్యోగాలని ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తుందనే నిరాశలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులంటే అంత చిన్నచూపా. అవమానకరంగా నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఏ విధంగా ప్రజాప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కొలువు వస్తదనీ అనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టే. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు, చదువుకున్న వారిని ఎల్లకాలం మోసం చేయలేరు. ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని, ఖాళీ అయ్యే ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వం ఇచ్చే వందల ఉద్యోగాలకి లక్షలాది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలను, ప్రోత్సాహకాలను అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమైనా సాంకేతిక నైపుణ్యలని ప్రభుత్వమే అందించాలి. ప్రతి మండలంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయాలి. తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణలని ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది.
శ్రవణ్ కుమార్, 76718 18367