Monday, December 23, 2024

పుతిన్ లాంటి అధ్యక్షులతో అణుయుద్ధం ముప్పు : బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర పదజాలంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విరుచుకు పడ్డారు. ఆయన వల్ల అణుయుద్ధం రూపంలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో విలేఖరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయుద్ధం గురించి ఆందోళన చెందాల్సిందే. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదం. శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం అని బైడెన్ తెలిపారు.

ఈ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా బైడెన్ విమర్శలు చేశారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి , తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ ట్రంప్ మాట్లాడటాన్ని బైడెన్ తప్పు పట్టారు. పుతిన్‌పై బైడెన్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి పుతిన్ విధానాలపై బైడెన్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.

పలు సందర్భాల్లో ఆయనను కసాయి, యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్నారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో జైల్లో మృతి చెందిన రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి పుతినే కారణమని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ కంటే బైడెన్ ఎంతో మేలని రష్యా అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని మాస్కో కోరుకుంటున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News