Saturday, November 23, 2024

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం: జో బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేందుకు అవకాశం ఉన్నందున, అందుకు ప్రతిస్పందించేందుకు అమెరికా కూడా సిద్ధంగానే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాక యుద్ధం అంచుల నుంచి వెనక్కి తగ్గాలని కోరారు. ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై తాజా వివరణ ఇచ్చిన బైడెన్…“ఏది జరిగినా, దానికి ప్రతిస్పందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది” అన్నారు. “మేము దౌత్యానికీ సిద్ధంగానే ఉన్నాము. యావత్ యూరొప్ సుస్థిరత, భద్రతకు రష్యాతో, మా మిత్రదేశాలు, భాగస్వాములతో దౌత్యం నెరిపేందుకు సిద్ధంగా ఉన్నాము.ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే పక్షంలో మేమూ ప్రతిస్పందించేందుకు తగు విధంగా సిద్ధంగా ఉన్నాము. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేసేందుకు అత్యధిక అవకాశం ఉంది” అని జో బైడెన్ వివరించారు. “ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆలస్యం చేయకుండా ఉక్రెయిన్‌ను వదిలి వచ్చేయాల్సిందిగా అక్కడ ఉన్న అమెరికన్లను నేను కోరాను. ఆ కారణంగానే మా రాయబార కార్యాలయాన్ని కైవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్‌కు మార్చాము. అది పోలాండ్ సరిహద్దులో ఉంది ” అని తెలిపారు. ఇదిలా ఉండగా యూరొప్‌లో సంక్షోభం పెరుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెళ్లారని కూడా జో బైడెన్ తెలిపారు.

ఉక్రెయిన్ సరిహద్దులో ఇప్పటికీ లక్షన్నర రష్యా సైనిక బలగాలు మోహరించి ఉన్నాయని నొక్కి చెబుతూనే సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. “నేడు (బుధవారం) ఉక్రెయిన్ సమీపంలో నుంచి కొన్ని రష్యా మిలిటరీ యూనిట్లు వెనక్కి వెళ్లిపోయాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అది మంచిదే. అయితే, అందులో వాస్తవం ఎంత అన్నది ఇంకా పరిశీలించుకోవాల్సి ఉంది. రష్యా దళాలు తమ స్వదేశీ స్థావరాలకు వెళ్లాయా లేదా అనేది మేము ఇంకా నిర్ధారించుకోవలసి ఉంది. అయితే రష్యా బలగాలు ఇప్పటికీ అక్కడ ముప్పు కలిగించే పొజిషన్‌లోనే ఉన్నాయని మా విశ్లేషకులు తెలిపారు” అని బైడెన్ తెలిపారు. ఒకవేళ రష్యా, ఉక్రెయిన్‌పై దాడి జరిపితే వ్యూహాత్మకంగా చాలా నష్టం జరుగుతుందన్నారు. “ఒకవేళ రష్యా, ఉక్రెయిన్‌పై దాడిచేస్తే అది అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరంగా పెద్ద ఎత్తున చావులు, విధ్వంసానికి రష్యా కారణమైతే ప్రపంచం దానిని మరచిపోజాలదు. అమెరికా నాటోకి చెందిన ప్రతి అంగుళాన్ని పరి రక్షించగలదు. అందుకు అమెరికా పూర్తి శక్తిని వినియోగించగలదు. నాటో కూటమిలోని దేశంపై దాడి అంటే, మాకు వ్యతిరేకంగా చేసే దాడిగానే మేము భావిస్తాము” అన్నారు. ఇదిలావుండగా ఉక్రెయిన్‌పై దాడి ప్రణాళికలను క్రెమ్లిన్(రష్యా) పదేపదే ఖండించింది. అమెరికా, నాటో దేశాలు రష్యాకు ముప్పు కాదని కూడా బైడెన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “ఒకవేళ రష్యా, ఉక్రెయిన్‌పై దాడికి దిగితే ప్రపంచ దేశాలు దానిని వ్యతిరేకిస్తాయి” అన్నారు. మేము దీర్ఘకాలిక ఆంక్షలు కూడా రష్యాపై విధించే అవకాశం ఉంటుంది. అంతేకాక రష్యా నుంచి జర్మనీ మధ్య నిర్మించే ‘నార్డ్ స్ట్రీమ్ 2’ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ కూడా సాకారం కాజాలదు” అని జో బైడెన్ వివరించారు.

ఉక్రెయిన్ ప్రతిష్టంభన నేపథ్యంలో…
మరిన్ని బలగాలను, ఆయుధాలను తమ స్థావరాలకు వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేస్తుందేమోననే భయాలను తొలగించడానికి రష్యా ఇలా చేసింది. అయినప్పటికీ రష్యా దాడి ముప్పు ఇంకా తొలగలేదని అమెరికా అంటోంది. ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రష్యా ఇప్పటికీ లక్షన్నర సైనిక బలగాలను మోహరించి ఉంచిందని అమెరికా తెలిపింది. ఆ బలగాలను ఉపసంహరించుకుంటున్న సూచనలేవి తమకు కనబడలేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ వారంలో మాస్కో కొన్ని చర్యలు తీసుకోవడంతో యుద్ధం జరుగకపోవచ్చనే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి దౌత్య మార్గం కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తెలిపారు. నాటో కూమిలో ఉక్రెయిన్ చేరకుండా చూడ్డమే తన లక్షం అని కూడా పుతిన్ స్పష్టం చేశాడు. అయితే రష్యా ఉద్దేశ్యాల విషయంలో ఇప్పటికీ అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాను నమ్మడంలేదు. బ్రిటిష్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ సైతం రష్యా చెబుతున్నట్లు అదేమి సైన్యాన్ని ఉపసంహరించుకోలేదని అన్నారు. రష్యా ఉపసంహరణకు సంబంధించిన సాక్ష్యాలేవి తాము ఇంకా చూడలేదన్నారు. ఇదివరకటి సోవియట్ దేశాలు నాటోలో చేరకుండా చూడాలనే రష్యా కోరుకుంటోంది. ఇదిలావుండగా తూర్పు ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని రష్యా శాసనసభ్యులు మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విన్నవించుకున్నారు.

Joe Biden comments on Ukraine-Russia Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News