Sunday, December 22, 2024

పుతిన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

- Advertisement -
- Advertisement -

Joe Biden has announced that US will support Ukraine

‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిక
నియంతలను కట్టడి చేయకపోతే వాళ్లు మరింత విధ్వంసం సృష్టిస్తారు
ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టీకరణ

వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికకా అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చ లేదని,ఉక్రెయిన్‌పై దాడులకు పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశం‘ స్టేట్ ఆఫ్ ది యూనియన్’ సమావేశంలో మాట్లాడుతూ బైడెన్ ఈ హెచ్చరికలు చేశారు. బలగాలతో దాడి చేయించి ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నా పుతిన్ ఉక్రెయిన్ ప్రజల మనసులను గెలుచుకోలేరని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమని మండి పడ్డారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకిని చేయాలని బైడెన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లోని ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యాఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.అమెరికా గగనతలంనుంచి రష్యా విమానాల రాకపోకలను నిషేధించినట్లు ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. రష్యాలో అర్థికసంక్షోభానికి పుతినే కారణమని బైడెన్ అన్నారు. ‘ నియంతలను కట్టడి చేయకపోతే వారు మరింత విధ్వంసం సృష్టిస్తారు.

వాళ్ల దాడులను విస్తరిస్తారు. ఈ క్రమంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు ముప్పునకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. పుతిన్ పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలు, నాటోఈ దాడులకు స్పందించవని ఆయన భావించారు. అయితే పుతిన్ అంచనా తప్పు. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను నిలువరిస్తూ వారి దాడులను తిప్పికొడుతోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ పౌరులు సైతం తుపాకులు చేత పట్టుకుని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బైడెన్ హెచ్చరించారు.పుతిన్, రష్యాపై రానున్న కాలంలో యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్ గెలిచినా.. ఓడినా ఆర్థికపరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వెనుక వరసలో కమలా హారిస్, నాన్సీ పెలోసి

కాగా బైడెన్ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించే సమయంలో వేదికపై ఆయన వెనుక అమెరికా రాజకీయాల్లో అత్యంత శక్తివంతులైన ఇద్దరు మహిళలు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కూర్చుని ఉండడం విశేషం. గత ఏడాది బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన కొద్ది రోజలుకే అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించారు. అప్పుడు కూడా వీరిద్దరూ బైడెన్ వెనుక కూర్చున్నారు. అయితే ఆ సమావేశాన్ని స్టేట్ ఆఫ్‌ది యూనియన్‌గా పరిగణించలేదని అమెరికా మీడియా పేర్కొంది. ఇలా ఇద్దరు మహిళలు అధ్యక్షుడి వెనుక కూర్చోవడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని కూడా అమెరికా మీడియా పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News