అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తోన్న వేళ జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షమాభిక్షలు, శిక్ష తగ్గింపుల్లో దూకుడు కనబర్చుతున్న ఆయన, గురువారం ఒక్కరోజే దాదాపు 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతోపాటు, 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఒకేరోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కరోనా వైరస్ విజృంభణ సమయంలో అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు చేపట్టింది. అప్పటికే ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కొవిడ్ ఉన్నట్టు అంచనా వేసింది. ఇలా జైలు నుంచి విడుదలైన తరువాత కనీసం ఏడాదిపాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి జోబైడెన్ శిక్ష తగ్గించాలని నిర్ణయించారు .
ఇందులో భాగంగా గురువారం నాడు అనేక మందికి శిక్ష తగ్గించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గించడంతోపాటు, క్షమాభిక్ష పిటిషన్లనూ పరిశీలిస్తానని జోబైడెన్ పేర్కొన్నారు. అమెరికాలో ఒకే రోజు ఈ స్థాయిలో శిక్షలు తగ్గించడం ఇదే తొలిసారి. గతంలో బరాక్ ఒబామా పదవీకాలం ముగిసే సమయంలో ఒకే రోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా, ఇప్పటివరకు అదే అత్యధికం. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఇప్పటివరకు 122 మందికి శిక్ష తగ్గించగా,మరో 21 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్‌కు, జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
అనంతరం మరణశిక్ష ఎదుర్కొంటున్న వారితోపాటు అనేక మంది ఖైదీలకు శిక్షతగ్గింపు , లేదా క్షమాభిక్షలపై బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలో పాల్గొన్న వారికి శిక్షతగ్గించాలా వద్దా? అన్నవిషయంపై బైడెన్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.