Monday, December 23, 2024

జీవితంలో ఇలాంటి ఘోరాలను చూస్తానని అనుకోలేదు:బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్:ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదన్నారు.దీన్ని అత్యంత పాశవికమైన చర్యగా అభివర్ణించిన ఆయన జీవితంలో అత్యంత ఘోరకలిని చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత శనివారం ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు పౌరులపై భీకర దాడులు చేసుంతన్న విషయం తెలిసిందే. హమాస్ వందలమంది అమాయక పౌరులను బందీలుగా చేసుకుని వారిని అత్యంత దారుణంగా హతమార్చిందని ఇజ్రాయెల్ రక్షణ దళం(ఇడిఎఫ్) ప్రకటించిన నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వ్యాఖ్యలపై శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. హమాస్ ఘోరాలకు సంబంధించిన చిత్రాలను బైడెన్ స్వయంగా చూడలేదని తెలిపారు.

అయితే ఇజ్రాయెల్‌లో వారు సృష్టిస్తున్న విధ్వసానికి సంబంధించి అందిన నివేదికల ఆధారంగానే ఆయన స్పందించినట్లు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో పలువురు అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్ ధ్రువీకరించారు. మరో వైపు బైడెన్ అమెరికాలోని యూదులతో బుధవారం సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌ను సైతం హెచ్చరించినట్లు బైడెన్ వారికి వివరించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేయవద్దని, ఈ విషయానికి దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నిరంతరం వాకబు చేస్తున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. యూదు ప్రజ భద్రతకు కట్టుబడి ఉన్నామనిచెప్పారు. దీనికోసం నిరంతరం ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News