న్యూఢిల్లీ: ఈ నెల 8నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న జి20 దేశాధినేతల సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన నేతలుహాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు హాజరు కావడం లేదు. వారి స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి, చైనా ప్రధాని ఈ సమావేశాలకు వస్తున్నారు. జి20 సమావేశాలకు హాజరవుతున్న నేతల జాబితా ఇలా ఉంది. జి20 సదస్సులు పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక రోజు ముందే అంటే ఈ నెల 7వ తేదీనే ఢిల్లీ రానున్నారు. సమావేశాలకు ముందు ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో బైడెన్ కూడా పరీక్షలు చేయించుకున్నారని, అయితే ఆయనకు నెగెటివ్ వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సమావేశాలకు గైరు హాజరుతో ఆయన స్థానంలో ప్రధాని లి క్వియాంగ్ చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ సమావేశాలకు విచ్చేస్తున్నారు. సునాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ సందర్శించడం ఇదే మొదటి సారి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా,దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌యేవో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రాంఫోసా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్‌లు ఈసమావేశానికి రానున్నారు. వీరితో పాటుగా యూరోపియన్ కౌన్సిల్‌కు చెందిన నేతలు, ఇటలీ అధ్యక్షుడు జార్జియా మెలోనీలు కూడా ఈ సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. అయితే వారి రాకపై ఇంకా ధ్రువీకరణ రాలేదు.