Monday, December 23, 2024

ఇంట ట్రంప్..బయట పుతిన్ పేరు మోసిన విలన్లు

- Advertisement -
- Advertisement -

ట్రంప్ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు బద్ధవిరోధి అని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఘాటుగా విమర్శించారు. ఆయన తమ హయాంలో చేసిన దుశ్చర్యలతో అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు మౌలిక అంశాలకు విఘాతం ఏర్పడిందని తెలిపారు. దేశాధ్యక్ష ఎన్నికల ఈ సంవత్సరంలోఆయన గురువారం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని సందేశం వెలువరించారు. ఈ సందర్భంగా తన కీలక రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌పై ఘాటైన రీతిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో దేశంలో అమెరికా అధ్యక్ష పదవికి ప్రచార పర్వం వేడెక్కింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు శత్రువు అయిన వ్యక్తిని ఎవరు ఆదరిస్తారని ప్రశ్నించారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం తుది ఘట్టాన్ని ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఇక ఓటర్లు నిజానిజాలు నిర్థారించుకుని స్పందించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం సాగింది. దాదాపు గంట సేపు ఆయన ప్రసంగం సాగింది. ఈ క్రమంలో తనకన్నా ముందు అధికారంలో ఉన్న వ్యక్తి అని పేర్కొంటూ 13 సార్లు ట్రంప్ గురించి ప్రస్తావించారు.

ఇటీవలి సూపర్ ట్యూస్‌డే పోటి తరువాత ఇక దేశంలో ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలలో ఇంతకు ముందటి లాగానే ఈసారి కూడా పోటీ రిపబ్లికన్ ట్రంప్, డెమోక్రాట్ బైడెన్ నడుమ నెలకొందని స్పష్టం అయింది. 81 సంవత్సరాల బైడెన్, తన సమీప ప్రత్యర్థి 77 ఏండ్ల ట్రంప్‌పై ఘాటైన విమర్శలతో ఈసారి ప్రచారం ఈ వృద్ధ నేతల నడుమ పోటాపోటీగా ఉంటుందని సంకేతాలు వెలువరించారు. బైడెన్ అమెరికాకు అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షులుగా నిలిచారు. తమ ప్రసంగంలో బైడెన్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. రష్యా అధినేత పుతిన్‌పై తాను చేసిన విమర్శల గురించి, ఇమిగ్రేషన్ల గురించి, జనవరి 6 నాటి దాడి ఘటన, అబార్షన్ , గన్ కల్చర్ వంటి పలు విషయాలను ప్రస్తావించారు. ఓ అధ్యక్షుడు తన హయాంలో మౌలిక విధి నిర్వహణను విస్మరించాడు. అమెరికన్లను సదా రక్షించాల్సిన బాధ్యతను మరిచాడు.దీనిని ఎవరూ క్షమించడానికి వీల్లేదని బైడెన్ తెలిపారు. చట్టసభలో ఆయన ఈ వ్యాఖ్యలకు దిగినప్పుడు డెమోక్రాట్ల నుంచి విశేష స్పందన వెలువడింది. ట్రంప్ ఇటీవల రష్యా నేత ఏదైనా చేయవచ్చునని చెప్పాడని, , ఈ విధంగా పుతిన్‌కు మోకరిల్లాడని విమర్శించారు.

దేశ చరిత్రలో అత్యంత గడ్డు పరిస్థితి నెలకొన్ని ఉన్నప్పుడు తాను అధికారంలోకి వచ్చినట్లు తెలిపిన బైడెన్ ఈ సవాళ్ల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగానని వివరించారు. దేశంలో అంతర్గతంగా ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకరంగా మారగా, మరో వైపు అంతర్జాతీయ స్థాయిలో పుతిన్ వ్యవహారం ప్రపంచానికి చేటు తెచ్చేలా మారిందని బైడెన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ ఆక్రమణ, యూరప్‌లో చిచ్చు రగిలించడం , ఇతరత్రా వైపరీత్యాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రష్యా దూకుడును నివారించాల్సిన అవసరం అమెరికాకు ఎంతైనా ఉంది. వెంటనే అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ముందుగా ఉక్రెయిన్‌కు సరైన ఆయుధ సాయం అవసరం అని, దీనికి యుఎస్ కాంగ్రెస్ మద్దతు అత్యవసరం అని విజ్ఞప్తి చేశారు. అమెరికా సాయం ఉంటేనే ఉక్రెయిన్ ధైర్యంగా నిలబడుతుంది. ఆ దేశానికి అవసరం అయిన ఆయుధ సాయం అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కోరుకుంటున్నది ఇదే అన్నారు. వారు అమెరికా సైనికులను పంపించాలని కోరడం లేదని, ఆయుధ సాయం అవసరం అంటున్నారని, ఇప్పటికీ ఉక్రెయిన్‌లో అమెరికా సైన్యం లేదని తెలిపారు.

బైడెన్ జ్ఞాపకశక్తి క్షీణించిందని, ఆయన పొంతన లేని మాటలకు దిగుతున్నాడనే ఇటీవలి వ్యాఖ్యల నడుమ ఇప్పుడు బైడెన్ చేసిన ప్రసంగం అత్యంత శక్తివంతంగా నిలిచింది. తన ప్రసంగం అంతా ఆయన చాలా స్పష్టంగా సరైన హావభావాలతో బిగ్గరగా సాగిందని, ఈ విధంగా ఆయన వయస్సు ఇతరత్రా అనారోగ్య విషయాలపై వాదనలు వీగాయని సిఎన్‌ఎన్ వ్యాఖ్యానించింది. సరిహద్దులు, ఇమిగ్రేషన్ వంటి కీలక అంశాలలో ట్రంప్ తప్పుడు పద్ధతులు దేశానికి ఎంతకూ తెగని సంక్లిష్టతలను తెచ్చిపెట్టాయని, ఇదే క్రమంలో పుతిన్ వ్యవహార శైలితో అంతర్జాతీయ స్థాయిలో శాంతికి , సరఫరాల వ్యవస్థకు ముప్పు వాటిల్లిందని బైడెన్ తమ విశ్లేషణాత్మక ప్రసంగంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News