Friday, November 22, 2024

నేడే అమెరికాపై బైడెన్ పతాక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(నేడు) ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశ ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతి వ్యక్తి కమలా హారిస్ కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. దేశంలో ఈ సారి ఎన్నికల ప్రక్రియ అంతా ఒడుదుడుకుల మధ్య జరిగింది. తరువాతి క్రమంలో ఓటమిని అంగీకరించకుండా ఉన్న ట్రంప్ వైఖరి, ఈ దశలోనే చట్టసభల కేంద్రం క్యాపిటల్ బిల్డింగ్‌పై మూకదాడితో అసాధారణ పరిస్థితి ఏర్పడటం, చిట్టచివరికి విజేతగా బైడెన్ నిర్థారణ కావడం తరువాత ఇప్పుడు బైడెన్, హారిస్ ప్రమాణ ఘట్టం జరుగనుంది. దేశ ఉపాధ్యక్ష బాధ్యతలలో తొలి మహిళగా కమలా హారిస్ అమెరికా చరిత్ర పుటల్లో నిలుస్తారు. భారతీయ పూర్వాపరాలను మననం చేసుకుంటూ ప్రమాణస్వీకార ఘట్టానికి చీర కట్టుతో వచ్చి తళుక్కుమంటారు. ట్రంప్ కన్నా వయస్సులో పెద్ద వాడైన బైడెన్ దేశానికి ప్రస్తుత సమకాలీన సంక్లిష్ట ప్రపంచ వ్యవస్థ నడుమ సారధి కానున్నారు. అందరితో మిత్రత్వ విధానం తమ పంథా అని బైడెన్ తేల్చిచెప్పారు. ఇందుకు తగ్గ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రధాన ఘట్టాలకు తలెత్తుతూ వస్తున్న కరోనా విషవలయం, ఇప్పుడిప్పుడే ఆశాకిరణం అవుతున్న వ్యాక్సిన్ల ఘట్టాల మధ్య బైడెన్ అధికార ప్రతిష్ట జరుగుతుంది. అమెరికాలో జరిగే బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ప్రతిసారి జరిగే అధ్యక్ష స్వీకార కార్యక్రమాలతో పోలిస్తే ఈసారి పరిస్థితి భిన్నంగానే ఉంటుంది. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, తీవ్రస్థాయి నిఘా నీడల మధ్య బైడెన్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. క్యాపిటల్ హిల్స్ ఘటన ఇప్పటి ఉత్సవానికి తగు విధంగా ఆర్బాటపు పాళ్లు లేకుండా చేసింది.
సమైక్య అమెరికా ఇతివృత్తంతో ఉత్సవం
ఇప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఇనాగరేషన్ ఉత్సవానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అమెరికా యునైటెడ్ ఇతివృత్తంతో బైడెన్ బృందం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సంఘటిత అమెరికా నినాదంతోనే బైడెన్ హారిస్ ద్వయం ఎన్నికల బరిలోకి దిగింది. దీనినే అధికారిక అధికార స్వీకార ఘట్టానికి నేపథ్యం చేసుకుంది.
కేవలం వేయి మందికి ఆహ్వానం
కరోనా వైరస్‌కు భౌతిక దూరాల పద్థతిపై ప్రచారం సాగించిన బైడెన్ దీనిని చేతల్లో చూపారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా సందడి లేకుండా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయించారు. ఆర్బాటం, జనం గందరగోళం పరిస్థితి లేకుండా కేవలం వేయి మంది కార్యక్రమానికి వచ్చేలా చూస్తున్నరు. అత్యధికంగా చట్టసభల సభ్యులు వారి అతిధులే విచ్చేస్తారు.
ఇనాగరల్ షెడ్యూల్‌ః
ఉదయం పది గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8.30)కు దేశాధ్యక్షులుగా బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం (పిఐసి) ఆరంభమవుతుంది. ఉంటుంది. కార్యక్రమానికి ముందు తరువాత అపూర్వ రీతిలో యువ అమెరికన్ల కోసం ప్రత్యేక విశేష ఘట్టాన్ని ఏర్చికూర్చి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముందు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభం అవుతుంది. సరిగ్గా ఉదయం 11.30 నిమిషాలకు ప్రమాణస్వీకారం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్‌తో అమెరికా దేశ ప్రధాన న్యాయమబూర్తి జాన్ రాబర్ట్ ప్రమాణం చేయిస్తారు.
వేదిక క్యాపిటల్ వెస్ట్ ఫ్రంట్
దేశ సంప్రదాయానికి అనుగుణంగా బైడెన్ ప్రమాణస్వీకారం క్యాపిటల్ బిల్డింగ్‌కు చెందిన వెస్ట్‌ఫ్రంట్‌లో జరుగుతుంది. దేశ వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రత్యక్ష ప్రసార ఘట్టం అవార్డుల విజేత, వినోదకారులు, అడ్వకేట్ కెకె పాల్మెర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో భాగంగా దేశ తొలి మహిళ జిల్ బైడెన్ ప్రత్యేక సందేశం ఉంటుంది. యువ అమెరికన్లకు ఉద్బోధ ఉత్తేజకరంగా ప్రముఖ చరిత్రకారులతో వ్యాఖ్యానాలు సాగుతాయి. ప్రమాణస్వీకారం తరువాత బైడెన్ దేశాన్ని ఉద్ధేశించి కొత్త అధ్యక్షుడి హోదాలో ప్రారంభోపన్యాసం చేస్తారు. తరువాత ప్రెసిడెంట్ బైడెన్ పద్థతి ప్రకారం క్యాపిటల్ ఈస్ట్ ఫ్రంట్‌కు బయలుదేరి వెళ్లుతారు. చిరకాలపు ఈ దేశ సంప్రదాయాన్ని పాస్ ఇన్ రివ్యూగా పిలుస్తారు. ఇందులో భాగంగా దేశ నూతన అధ్యక్షులు దేశ సైనిక బలగాల సామర్థాన్ని పర్యవేక్షిస్తారు. దీనిని కవాతుగా భావించవచ్చు. దీని తరువాత బైడెన్, హారిస్, మాజీ అధ్యక్షులు ఒబామా, జార్జి డబ్లు బుష్, బిల్ క్లింటన్ వారి జీవితభాగస్వాములతో కలిసి అర్లింగ్టన్ జాతీయ ఖనన వాటికకు వెళ్లుతారు. ఈ స్థలిలోనే అమెరికా అజ్ఞాత సైనికుల స్మారక చిహ్నం ఉంది. ఇక్కడ ప్రముఖులంతా పుష్ఫగుచ్ఛాలుంచి దేశం కోసం అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. జాతీయతను చాటుకుంటారు.
సైనిక పహారా నడుమ వైట్‌హస్‌కు
ప్రమాణస్వీకార ఘట్టం తరువాత జో బైడెన్ స్ట్రీట్ నెంబర్ 15 నుంచి ప్రెసిడెంట్ అధికారిక నివాస కేంద్రం శ్వేతసౌధానికి సైనిక ఎస్కార్ట్ నడుమ బయలుదేరి వెళ్లుతారు. ఇందులో దేశ సైనిక దళాలన్నింటికి ప్రతీకాత్మకంగా ప్రాతినిధ్యం ఉంటుంది. సాయంత్రం వర్చువల్ పద్థతిలో పలు కార్యక్రమాలు జరుగుతాయి.
గంటన్నర అమెరికా ఉత్సవం
ఈసారి ప్రత్యేకంగా అదనపు ఆకర్షణగా 90 నిమిషాల పాటు సాగే సెలెబ్రెటింగ్ అమెరికా ఉత్సవం ఉంటుంది. అధికారిక ప్రమాణ స్వీకార ఘట్టం తరువాత ఇది జరుగుతుంది. దీనికి టామ్ హాంక్స్ హోస్ట్‌గా ఉంటారు. మధ్య మధ్యలో బైడెన్, హారిస్‌ల స్పందనల నడుమ అమెరికా వాగ్గేయకారుడు ఆంట్ క్లెమన్స్ ఇతర కళాకారులు జాన్ బాన్ జోవి, డెమి లోవాటో , జస్టిన్ టింబెరలేక్ గేయసమ్మేళనం సాగుతుంది.
లైవ్ లవ్లీ ఏర్పాట్లు
ఎక్కువ మంది జనం రాలేని ప్రస్తుత కరోనా స్థితిలో జనం ఇంటి నుంచే ప్రెసిడెంట్ ప్రమాణస్వీకారం అన్ని జాతీయ ప్రధాన చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలూ ఇందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.

Joe Biden to be sworn as US President on Wednesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News