Saturday, November 16, 2024

బైడెన్ శకం

- Advertisement -
- Advertisement -

Joe Biden took oath US president on January 20

 

అమెరికాకే కాదు మొత్తం ప్రపంచానికే నవ శకావిష్కరణ జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. ఓడిపోయిన తర్వాత కూడా పదవిని పట్టుకొని మొండిగా వేలాడి అత్యంత అయిష్టంగా దిగిపోయి సంప్రదాయ విరుద్ధంగా వైట్ హౌస్‌ను విడిచిపెట్టిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల హయాంలో అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా పలు విధాలైన అసంతృప్తులకు లోనయ్యా యి, అసౌకర్యాలు అనుభవించాయి. 2017 జనవరిలో ట్రంప్ ధరించిన అగ్రరాజ్యాధిపత్య కిరీటం పిచ్చివాడి చేతిలోని రాయిలా పని చేసింది. ఆ బాధాకరమైన అధ్యాయానికి అమెరికన్లు రెండున్నర మాసాల క్రితమే ఓటు ఆయుధంతో తెర దించినా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్‌లు అక్కడి పద్ధతి ప్రకారం జనవరి 20వ తేదీన అధికారాన్ని చేపట్టగలిగారు. బుధవారం నాటి వారి నియామక ఘట్టం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. అమెరికాలో అధికారం చేతులు మారిన మిగతా సందర్భాలన్నింటి కంటే ఇది విశిష్టమైనది.

బైడెన్ అధ్యక్షుడు గా చేసిన మొట్ట మొదటి ప్రసంగంలో పేర్కొన్నట్టు ‘ఇది అమెరికా విజయోత్సవ దినం, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, చరిత్రాత్మకమైన, ఆశాజనకమైన దినం, ఒక అభ్యర్థి ఓడిపోయి మరొకరు అధ్యక్ష పీఠం ఎక్కడమే కాదు, ప్రజాస్వామ్య ప్రయోజనం సిద్ధించిన క్షణం. ప్రజల అభీష్టం నెగ్గిన సందర్భం’. అందుచేత ఈ గొప్ప క్షణంలో అమెరికన్ ప్రజలను హృదయపూర్వకంగా అభినందించాలి. డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో ఒక వర్గం అమెరికన్లలో నిద్రాణంగా ఉన్న జాత్యహంకారాన్ని గరిష్ఠ స్థాయికి రెచ్చగొట్టి తన ఓటు బ్యాంకును పెంచుకున్నాడు. అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం (అమెరికా ఫస్ట్) అనే నినాదోన్మాదంతో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ అంతకు ముందు వరకూ చిరకాలంగా ఆ దేశం పోషిస్తూ వచ్చిన సానుకూల అంతర్జాతీయ పాత్రను తెర వెనుకకు నెట్టి వేశాయి. పదులు, వందల సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి స్థిరపడిపోయి ఆ దేశానికి జవసత్వాలై బతుకుతున్న వివిధ దేశాల జాతులకు చెందిన వలస ప్రజలకు స్థానిక తెల్లవారికి మధ్య అఖాతాన్ని ఏర్పరచాయి.

ఇది మొన్నటి అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ సరళిలో ప్రస్పుటమైంది. గత ఎన్నికల్లో ఎలెక్టోరల్ ఓట్ల ఆధిక్యం కారణంగా కిరీటాన్ని ధరించిన ట్రంప్‌కి అప్పుడు 6 కోట్ల 29 లక్షల పై చిలుకు ఓట్లు పడగా, ఈసారి ఓటమి పాలైనప్పటికీ 7.4 కోట్ల ఓట్లను ఆయన సాధించుకోగలిగాడు. కరోనాతో పోరులో ఘోర వైఫల్యం కారణంగా, ఇతరత్రా ఆయనను ప్రజా ఓటు, ఎలెక్టోరల్ ఓటు రెండింటి పరంగానూ అమెరికన్లు పరాజయం పాలు చేశారు. అయితే గతం కంటే కోటికి పైగా అధిక ఓట్లు ట్రంప్‌కు పడడం ఆయన విధానాలను అమెరికన్లలోని ఒక బలమైన వర్గం గట్టిగా సమర్థిస్తున్నదని రుజువు చేసింది. అదొక ఎత్తు కాగా, ట్రంప్ ఆదేశాల మేరకు రెండు వారాల క్రితం వేలాది మంది ఆయన అనుయాయులు అమెరికా పార్లమెంటు కొలువున్న కేపిటల్ హిల్ భవనంలోకి ప్రవేశించి నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ధ్రువీకరణ సంయుక్త సమావేశానికి హింసాత్మకమైన తాత్కాలిక అంతరాయం కలిగించడం మరో ఎత్తు.

ఎన్నో అబద్ధాలు, అతిశయోక్తులు చెప్పి అమెరికన్లలోని ఒక బలమైన వర్గాన్ని అక్కడి ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ట్రంప్ సంఘటిత పరిచాడని రుజువైపోయింది. ఈ వర్గాన్ని కూడా కలుపుకొని అమెరికా సమాజ అసలు విలువలను పునరుద్ధరించవలసిన బాధ్యత బైడెన్ మీద పడింది. ఆ విషయాన్ని ఆయన గ్రహించాడని రుజువవుతున్నది. తాను ఐక్య అమెరికాకు అధ్యక్షుడినని అందరి వాడినని తన ప్రథమ ప్రసంగంలో బైడెన్ ఉద్ఘాటించారు. ట్రంప్ వెనుక నిలిచిన వర్గాన్ని తన వైపు తిప్పుకునే క్రమంలో వారిలో గూడుకట్టుకున్న ఒంటెత్తు జాత్యహంకార భావజాలాన్ని బైడెన్ ఏ విధంగా నిశ్శేష స్థాయికి కరిగించగలుగుతాడో చూడాలి. అధ్యక్షుడుగా బైడెన్ తొలి సంతకాలు చేసి పార్లమెంటు ఆమోదానికి పంపించిన నిర్ణయాలలో వలస విధానం సమూల మార్పులకు చెందిన బిల్లు కూడా ఉండడం హర్షదాయకం.

దీని వల్ల ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలు లేకుండా పదేళ్లకు పైగా అమెరికాలో కొనసాగుతున్న అక్రమ వలసదార్లకు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. అలాగే గ్రీన్ కార్డులు, శాశ్వత పౌరసత్వ అనుమతులు సులభంగా లభిస్తాయని ఆశిస్తున్నారు. ట్రంప్ తన ఘనతర లక్షంగా ప్రకటించుకొని పునాదులు వేసిన మెక్సికో అమెరికా మధ్య గోడ నిర్మాణానికి స్వస్తి చెప్పాలని బైడెన్ నిర్ణయించడం ఆనందించవలసిన విషయం. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను తప్పిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడం, పారిస్ ఒప్పందంలో మళ్లీ అమెరికాను చేర్చదలచడం, ఇరాన్‌తో అణు ఒప్పందం పునరుద్ధరణ వగైరా నిర్ణయాలతో అమెరికా సానుకూల అంతర్జాతీయ పాత్రను బైడెన్ పునరుద్ధరించబోడం నిజంగానే నవ శకాన్ని సూచిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News