Sunday, January 19, 2025

అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత ప్రభావితం: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : గతంలో కన్నా అమెరికాభారత్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్రియాశీలకమై ప్రపంచంలో “అత్యంత ప్రభావితం” అయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రక అధికారిక పర్యటనతో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉద్దీపింప చేసిందని బైడెన్ ఉద్ఘాటించారు. మోడీ తన పర్యటనలో అధ్యక్షుడు బైడెన్‌తో విస్తృతస్థాయిలో వివిధ అంశాలపై చర్చించారు. అలాగే యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగించి, ఆ విధంగా రెండు సార్లు ప్రసంగించిన మొదటి భారతీయ నాయకుడయ్యారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్స్‌లో రికార్డు స్థాయిలో 7000 మంది ప్రతినిధులు హాజరై మోడీకి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చారు.

అలాగే అమెరికా ప్రభుత్వ విందు సమావేశానికి వివిధ పారిశ్రామిక, సాంకేతిక, వాణిజ్య రంగాలకు చెందిన ప్రతినిధులుతోపాటు ఆయా సంస్థల సిఇఒలు, అధికారులు దాదాపు 500 మంది హాజరయ్యారు. బైడెన్ స్పందనకు బదులుగా మోడీ ఉభయ దేశాల మధ్య స్నేహం , ప్రపంచానికి మేలు చేసే ఒక శక్తిగా ఉందని, ఇది భూ మండలాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుందని , మన బంధాన్ని నా తాజా పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ట్విటర్ ద్వారా బైడెన్‌కు మోడీ వివరించారు. మోడీ పర్యటన ప్రభావంపై వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో రక్షణ, హరిత ఇంధనం, అంతరిక్షరంగాల్లో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం విస్తరిస్తుందని పేర్కొంది.

విద్యాపరమైన పరస్పర మార్పిడి, ప్రజల మధ్య సత్సంబంధాల పెంపు, వాతావరణ మార్పుల నుంచి పనిచేసే శక్తి అభివృద్ధి , ఆరోగ్యభద్రత వరకు ఉభయ దేశాల నేతలు చర్చించారని వైట్‌హౌస్ వివరించింది. రక్షణ, అంతరిక్షం, వాణిజ్య రంగాలకు సంబంధించి అమెరికా, భారత్ మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. భారత వైమానిక తేలికపాటి యుద్ధ విమానాలు ఎంకె 2 తేజస్‌లను ఉమ్మడిగా తయారు చేయడానికి హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ సంస్థ (హెచ్‌ఎఎల్)తో ఒప్పందం కుదిరినట్టు జెనరల్ ఎలెక్ట్రిక్ ఎయిరోస్పేస్ వెల్లడించింది. జెనరల్ అటామిక్స్ నుంచి సాయుధ ఎంక్యు 9 బి సీ గార్డియన్ డ్రోన్లను సేకరిస్తామని భారత్ వెల్లడించింది.

అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి అమెరికాతో కలిసి పనిచేయడానికి వీలుగా ఆర్టెమిస్ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకోవడం విశేషం. గుజరాత్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్‌ను నెలకొల్పుతామని కంప్యూటర్ స్టోరేజి చిప్ తయారీ సంస్థ మైక్రాన్ వెల్లడించడం విశేషం. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్ డిజిటైజేషన్ నిధి కింద 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడతామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News