Monday, December 23, 2024

ట్రంప్‌కి గట్టిపోటీ తప్పదా?

- Advertisement -
- Advertisement -

‘భారతీయుల ప్రతిభ ఖండాంతరాలు దాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారతీయ సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. పలు దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయులు సిఇఒలుగా వ్యవహరిస్తున్నారు. భారత దేశాన్ని రెండు శతాబ్దాలు పాలించిన బ్రిటన్ లాంటి దేశానికి భారత సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి భారతీయులు ఉవ్విళ్ళూరుతున్నారు’. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే వారి జాబితాలో పలువురు భారతీయ -అమెరికన్ నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ట్రంప్‌పై రిపబ్లికన్ పార్టీ తరఫున భారతీయ అమెరికన్లు వివేక్ రామస్వామి,

నిక్కీ హేలీ, హర్షవర్ధన్ సింగ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొన్ని క్రిమినల్ కేసుల్లో చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ ట్రంప్ నామినేషన్ రేసులో ముందంజలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ (51) సౌత్ కరోలినాకు రెండు సార్లు గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారిగా పని చేశారు. వరుసగా మూడో సారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మూడో భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ కావడం గమనార్హం. హేలీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రంధవా, రాజ్ కౌర్ రంధవా. వీరు 1960 లో పంజాబ్ నుంచి కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చారు. హేలీ 39 సంవత్సరాల వయసులో 2011లో తొలిసారిగా గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో అతి పిన్న వయసులో సౌత్ కరోలినాకు గవర్నర్‌గా పని చేసిన మహిళగా హేలీ చరిత్ర సృష్టించారు.

భరత వంశీ హర్షవర్ధన్ సింగ్- ఏరోస్పేస్ ఇంజినీర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భరత వంశీ హర్షవర్ధన్ సింగ్ కూడా చేరారు. ఏరోస్పేస్ ఇంజినీర్ హర్షవర్ధన్ తన జీవితాంతం రిపబ్లికన్‌గా కొనసాగుతానని ఒక వీడియోలో తెలిపారు. న్యూజెర్సీలో రిపబ్లికన్ పార్టీ సంప్రదాయవాద విభాగాన్ని పునరుద్ధరించడంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వచ్చాయని సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ మార్పులను అధిగమించడానికి, అమెరికన్ విలువలను స్థాపించడానికి బలమైన నాయకత్వం అవసరమని, అందుకోసమే తాను అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2017, 2021లో న్యూజెర్సీ గవర్నర్ పదవికి, 2018లో ప్రతినిధుల సభకు, 2020లో రిపబ్లికన్ ప్రైమరీలలో సెనేట్‌కు పోటీ చేసినా గెలవలేకపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి పోటీకి సై అంటున్నారు. రిపబ్లికన్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో తన పోటీ గురించి అధికారికంగా వెల్లడించారు.

ఇప్పటికే భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ నిక్కీ హేలీ ఎన్నికల్లో పోటీపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఆమె తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారత సంతతి నేత వివేక్. ‘అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా రామస్వామి అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. 2014లో రోవాంట్ సైన్సెస్ బయోటెక్ సంస్థను స్థాపించి రామస్వామి పలు వ్యాధులకు ఔషధాలను రూపొందించారు. ఎఫ్‌డిఎ అనుమతితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అందుబాటులోకి తెచ్చారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీని ద్వారా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోన్న కీలక సంస్థల్లోని పౌరుల గొంతుకను వినిపించేందుకు కృషి చేస్తున్నారు.

2016లో ఫోర్బ్ గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. దీంతో 40 ఏళ్లలోపు వయసున్న సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. నిక్కీ హేలీ, ట్రంప్‌తో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్సే తదితరులు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉండనున్నారు. తాజాగా ఆ జాబితాలో వివేక్ రామస్వామి చేరారు. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడే అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ర్యాలీలు, ఫండ్ రైజింగ్, డిబేట్‌లను నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా ఎమెర్సన్ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్‌లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 56% ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులుగా నిలిచిన డేశాంటిస్, రామస్వామిలు 10% చొప్పున సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

అయితే, రామస్వామి మద్దతుదారుల్లో అత్యధికులు (దాదాపు సగం మంది) ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా చెబుతుండగా, డేశాంటిస్ మద్దతుదారుల్లో మాత్రం తడబాటు కనిపిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్లు, 35 ఏళ్ల లోపు వయసున్న వారి మద్దతు కూడగట్టడంలో వివేక్ రామస్వామి పురోగతి సాధిస్తున్నట్టు ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబల్ పేర్కొన్నారు. ట్రంప్ మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలో దూసుకుపోతున్న రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, హర్షవర్ధన్ సింగ్‌లతో సహా వివేక్ రామస్వామి వచ్చే వారం మొదటి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లో పాల్గొనే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. ముఖ్యంగా ఈ డిబేట్‌కు హాజరు కాకూడదని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 80% కంటే ఎక్కువ మంది రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లు తాము చర్చను చూడాలనుకుంటున్నామని చెప్పారు. తన రాజకీయ ప్రచారం ‘న్యూ అమెరికన్ డ్రీమ్’ పై రామస్వామి దృష్టి సారించారు. ఇదే సమయంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం రామస్వామికి మద్దతు ప్రకటించారు. ఆయనను చాలా సమర్ధవంతమైన అభ్యర్థిగా అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News