కోహ్లిని దాటేసిన రోహిత్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో శతకంతో చెలరేగిన రూట్ ర్యాంకింగ్స్‌లో దుమ్మూ దులిపాడు. 916 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత రూట్ టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న రోహిత్ 773 పాయింట్లతో ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇక వరుస వైఫల్యాలు చవిచూస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆరో స్థానానికి పడిపోయాడు. గతంలో చాలా ఏళ్లపాటు టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగిన కోహ్లి ప్రస్తుతం వరుస వైఫల్యాలతో ర్యాంకింగ్స్‌లో వెనుకంజ వేశాడు. ఇక భారత వికెట్ కీర్ రిషబ్ పంత్ టాప్10 జాబితా నుంచి వైదొలిగాడు. పంత్ 695 పాయింట్లతో ఏడు నుంచి 12వ ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్లు లబూషేన్ నాలుగో, డేవిడ్ వార్నర్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. డికాక్ (సౌతాఫ్రికా), హెన్రీ నికోల్స్ (కివీస్)లు టాప్ టెన్‌లో చోటు కాపాడుకున్నారు. బౌలింగ్ విబాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), రవిచంద్రన్ అశ్విన్ (భారత్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. టిమ్ సౌథి (కివీస్) మూడో, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. ఇక ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని టాప్10లో చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది, జేసన్ హోల్డర్ (విండీస్), రబడా (సౌతాఫ్రికా), నీల్ వాగ్నర్ (కివీస్) టాప్10లో నిలిచారు.