తొలిసారి దళితుడికి పార్టీ రాష్ట్ర
పగ్గాలు రాష్ట్ర కమిటీ నుంచి
70ఏళ్లు దాటిన వారి తొలగింపు
60 మంది సభ్యులతో రాష్ట్ర
కమిటీ ఏర్పాటు
మన తెలంగాణ/సంగారెడ్డి: సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో నాలుగు రోజులుగా ఆ పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. చివరి రోజైన మంగళవారం రాష్ట్ర కమిటీని ప్రతిపాదించారు. జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం స్థానంలో ఎన్నుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అమరచింత ప్రాంతానికి చెందిన జాన్వెస్లీ డివైఎఫ్ఐ, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. 70 సంవత్సరాలు దాటిన వారిని రాష్ట్ర కమిటీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర కార్యదర్శిగా మిర్యాలగూడ మాజీ ఎంఎల్ఎ జూలకంటి రంగారెడ్డి ఎన్నికవుతారని భావించగా, అనూహ్యంగా జాన్ వెస్లీ పేరు తెరపైకి వచ్చింది. తొలిసారిగా దళిత వర్గానికి చెందిన జాన్ వెస్లీని మార్కిస్టు పార్టీ ఎన్నుకుంది. 60 మందితో ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జి.నాగయ్య, ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్రావు, టి.జ్యోతి, సాగర్, అబ్బాస్, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్, రవికుమార్, జె.వెంకటేశ్, ఎస్.రమ, భూపాల్, పి.జయలక్ష్మి, రాంపల్లి రమేష్, ఎంఎల్సి నర్సిరెడ్డి, రవి, కె.హిమబిందు, ఎంవి రమణ తదితరులు ఉన్నారు.