Wednesday, January 22, 2025

డ్రాగన్‌కు జి7 చురకలు

- Advertisement -
- Advertisement -

 ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు స్పందించాలి
 సూపర్ పవర్‌గా బాధ్యత నిర్వర్తించాల్సిందే
 వ్యూహాత్మక భాగస్వామి చెపితే పుతిన్ ఖాతరు చేస్తారు
 జి7 దేశాల సదస్సులో సంయుక్త ప్రకటన
అగ్రశక్తిగా పేర్కొంటూనే డ్రాగన్‌కు చురకలు

హిరోషిమా : ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని, అతిక్రమణను నివారించేలా చైనా వెంటనే రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని జి 7 వేదిక నుంచి పిలుపు నిచ్చారు. అత్యంత సంపన్నమైన ఏడు ప్రజాస్వామిక దేశాల కూటమిగా జి 7 వ్యవహరిస్తోంది. జపాన్‌లోని చారిత్రక అణుబాంబు తాకిడి స్థలి హిరోషిమా వేదికగా జి7 సదస్సు జరుగుతోంది. చైనా రష్యాకు అన్ని విధాలుగా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నందున మానవాళికి ముప్పుగా మారిన ఉక్రెయిన్ పరిస్థితిపై చైనా స్పందించాల్సి ఉందని జి 7 కోరింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను శనివారం జి7 వెలువరించింది. రష్యా తన చర్యల నుంచి వైదొలిగేలా చైనా అన్ని విధాలుగా నచ్చచెప్పాల్సి ఉందని తీర్మానంలో స్పష్టం చేశారు.

జి 7 ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాకు కీడు తలపెట్టేది లేదని , ఆ దేశంతో నిర్మాణాత్మక స్థిరమైన సంబంధాలు ఆశిస్తోందని ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో తమ ఆందోళనను చైనా దృష్టికి ఈ వేదిక నుంచి తీసుకురావడం జరుగుతోందని తెలిపారు. ఉక్రెయిన్‌పై అతిక్రమణను , సైనిక చర్యను నిలిపివేసేలా రష్యా వ్యవహరించేలా చేయాలి. తక్షణం, బేషరతుగా, పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ నుంచి రష్యాబలగాలు వైదొలిగేలా చూడాల్సిన బాధ్యత , అందుకు తగ్గ అవకాశం చైనాకు ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంతేకాకుండా ప్రపంచం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం విషయంలో కూడా చైనా తన ఆర్థిక ప్రపంచ స్థాయి స్థితితో కీలక పాత్ర పోషించాల్సి ఉందని సూచించారు.

ఇదే దశలో జి 7 వేదిక నుంచి చైనాకు చురకలు కూడా పెట్టారు. తైవాన్ ప్రతిపత్తిని చైనా గౌరవించాల్సి ఉందని , సౌత్ చైనా సీలో ప్రాదేశిక సమగ్రతను పాటించాలి. ఐరాస ఛార్టర్‌కు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈస్ట్, సౌత్ చైనా సీ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చైనా తరచూ తనదైన వాదనను బలోపేతం చేసుకుంటూ సైనిక ఉనికిని చాటుకోవడం, ప్రత్యేకించి స్వయంపాలిత తైవాన్‌పై ఆధిపత్యాన్ని చాటుకునేందుకు బెదిరింపులకు దిగడం జరుగుతున్నదనే విమర్శల నేపథ్యంలో జి 7 సదస్సు సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని ప్రధానంగానే ప్రస్తావించారు. టిబెట్, హాంగ్‌కాంగ్ సహా చైనాలోనూ, ప్రత్యేకించి పశ్చిమ లోతట్టు ప్రాంతం జిన్‌జియాంగ్‌లో నిర్బంధ వెట్టి ఇతర పరిస్థితులు, మానవ హక్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా ప్రపంచ స్థాయి సూపర్ పవర్‌గా ఎదగడాన్ని జి 7 దేశాలు అడ్డుకుంటున్నాయనే వాదనను ఈ ప్రకటన దశలో తోసిపుచ్చారు. చైనా అన్ని విధాలుగా సరైన శక్తిని సంతరించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమమే అయితే ఆర్థికంగా, భౌగోళికంగా , సముద్ర జలాలపరంగా దూకుడు ధోరణిని సహించేది లేదని, దీనిని సంఘటితంగానే ప్రతిఘటించడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. చట్ట వ్యతిరేకమైన సాంకేతిక బదలాయింపులు, డ్రోన్ల తరలింపులు ద్వారా డాటా తస్కరణ, ఇతర దేశాల కీలక సమాచార తస్కరణ, నిఘా వంటి చర్యలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
నెంబర్ 1 దోపిడి, అతిక్రమణదారు అమెరికానే

జి 7 తీరుతెన్నులపై దాడికి దిగిన చైనా
జి 7 సదస్సు నుంచి తమ దేశంపై వెలువడ్డ తీవ్ర ఆరోపణలను వెనువెంటనే చైనా ఖండించింది. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా జి 7 సంయుక్త ప్రకటనను టార్గెట్ చేసుకుంటూ విమర్శకు దిగింది. ఇది కేవలం వేటాడటం, బెదిరించడం, చైనా అగ్రశక్తిగా ఎదగకుండా చేసే దుష్ట ప్రయత్నం అని చైనా విమర్శించింది. నిజానికి బలప్రయోగాలు, జోక్యాలు అతిక్రమణల మాటకు వస్తే అమెరికానే నెంబరు ఒన్‌గా నిలుస్తుంది. అమెరికా పెత్తనపు జి 7 దేశాలకు ఉన్న ఈర్షాద్వేషాలు ఇప్పుడు చైనాపై బహిరంగంగా వ్యక్తం అయ్యాయని, ఏళ్ల తరబడిగా అమెరికా పలు ప్రాంతాలలో పరోక్షంగా దోపిడికి దిగడం, రక్తం ఒడ్డేలా చేయడం తెలిసిన కథనే అని చైనా పేర్కొంది. ఇప్పుడు జపాన్ ఆతిధ్యం ఇస్తోన్న జి 7లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఇయూ సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్, ఉక్రెయిన్ , ఏడు ఇతర దేశాధినేతలను ఆహ్వానితులుగా పిలిచారు. మూడురోజుల పాటు జరిగే జి 7 ఆదివారం ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News