Wednesday, January 22, 2025

గ్రామాల్లో జోష్…పట్టణాల్లో నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఓటు వేయడంలో పట్టణ ప్రజల నిర్లిప్తత
గత ఎన్నికల్లో అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్న గ్రామీణ ఓటర్లు
ఈసారి అభ్యర్థులపై ప్రభావం చూపనున్న పట్టణ ఓటర్లు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. దీంతో పార్టీలన్ని పట్టణాలు, గ్రామాలను చుట్టేస్తున్నాయి. అందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. తాజాగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో మాత్రం ఓటు వేసేందుకు ఓటర్లు నిర్లిప్తత ప్రదర్శిస్తుండడం గమనార్హం. కానీ, కొన్ని సరిహద్దు ప్రాంతాలతో పాటు చత్తీస్‌ఘడ్ లాంటి ప్రాంతంలో ఓటు వేయడానికి అక్కడి ప్రజలు చూపుతున్న ఉత్సాహం మిగతా రాష్ట్రాల వారు అవలంభిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం తగ్గడం విశేషం. ఈసారి కూడా అలాగే జరిగితే పలు పార్టీల అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు కోసం పార్టీలు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో ప్రజల వద్దకు వెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క ఛాన్స్ కోసం కొందరు మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తుండగా, వారి భవితను మార్చే గ్రామీణ, పట్టణ ఓటర్లు ఏ మేరకు ఓటింగ్‌లో పాల్గొంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దట్టమైన అడవుల్లో స్ఫూర్తిని చాటిన ఓటర్లు
తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరిగాయి. ఓవైపు ఆ రాష్ట్రానికి దట్టమైన అడవులతో పాటు మరోవైపు మావోయిస్టులు ప్రాబల్యం ఎక్కువే. అలాంటి తరుణంలో అక్కడి ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వజ్రాయుధంగా చేసుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌లో ఉన్నంత నిర్బంధం ఇక్కడ లేకున్నా చదువుకున్న వారు, పట్టణ ప్రాంత వాసులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో ప్రజలు చూపిన తెగువ, అలాంటి స్ఫూర్తిని మనం చాటాలి. పట్టణ ప్రాంత వాసులు వీరి స్ఫూర్తితో వందశాతం దిశగా అడుగులు వేయాలి.
గత ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో 78 శాతం పోలింగ్
మంచిర్యాల జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో 78.72 శాతం పోలింగ్ నమోదైంది. కానీ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం నమోదు కావడం గమనార్హం. మంచిర్యాల మండలంలో 68.26 శాతం, నస్పూర్లో 64.16 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 81.64 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో ఆదిలాబాద్ పట్టణంలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటింగ్ నమోదయ్యింది. ఇక బేల మండలంలో 90.49 శాతం నమోదు కావడం గమనార్హం.

నిర్మల్ జిల్లాలో మొత్తం 80.52శాతం ఓటింగ్ నమోదైంది. నిర్మల్ పురపాలికలో 67,153 మంది ఓటర్లకు 45,732 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో 68.10 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతంలోని లక్ష్మణాచాంద మండలంలో 90 శాతం ఓటింగ్ నమోదు కాగా, చంద్రపూర్‌లో 91.84, పార్వెల్లిలో 91.50 శాతం మంది ఓటు వేశారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 86 శాతం ఓటర్లు ఓటేశారు. కాగజ్ నగర్ పట్టణ ప్రాంతంలో 43,487 మంది ఓటర్లుండగా కేవలం 28,731 మంది (66.06 శాతం) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఓటింగ్ అంతా గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు వేసిందే. రెబ్బెన మండలంలో 87.08 శాతం ఓటింగ్ నమోదు కాగా, వాంకిడి మండలంలో 86 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News