Thursday, January 23, 2025

మానవ స్వార్థం జోషి మఠ్‌కు శాపం

- Advertisement -
- Advertisement -

దాదాపు 50 సంవత్సరాల క్రితం సమర్పించిన మిశ్రా కమిటీ నివేదిక నిజాలు నేడు జోషిమఠ్ సంఘటనలు ద్వారా వాస్తవ రూపం దాల్చినాయి. గత ఐదు రోజులుగా ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ గ్రామం దేశ వ్యాప్తంగా వార్తల పతాక శీర్షికలో హాట్ టాపిక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ‘ప్రతీ నిమిషం విలువైనదే’ అనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరినీ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తూ, పునరావాస కేంద్రాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేరవేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దీనికంతటికీ కారణం గత కొన్ని దశాబ్దాలుగా మానవుని పనులు ప్రకృతితో వైరం పెంచుకొనుటయే.. అనేది నిర్వివాదాంశం. అభివృద్ధి పేరుతో అడవులు, కొండలు, గుట్టలు ఇష్టానుసారంగా నరికి వేయడం, భూగర్భ జలాలను తోడువేయడం, హైడ్రాలిక్ ప్రోబబిలిటీస్ పేరుతో విచ్చలవిడిగా భూ అంతర్భాగాలను చీల్చి చెండాడటం, విద్యుత్ ఉత్పత్తి, భారీ కట్టడాలు, విశాలంగా రహదారులు నిర్మించటం వంటి పనులు అన్నియు కలిపి మొత్తం జోషి మఠ్ గ్రామానికి పెను ప్రమాదాలు దాపురించేలా చేశాయి. కేవలం ఇటువంటి ప్రమాదాలు ఈ జోషి మఠ్‌కే కాదు, దాదాపు హిమాలయ పర్వత శ్రేణులను ఆనుకుని ఉన్న అన్ని గ్రామాలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని అందరూ గ్రహించాలి.

25 వేలు జనాభా నివసించే జోషి మఠ్ గ్రామానికి పర్యాటకం పేరున వచ్చే సందర్శకులు సంఖ్య దాదాపు ప్రతీ సంవత్సరం 5 లక్షలకు పైగా చేరటం వల్ల, వారి సౌకర్యార్థం నిర్మించే బహుళ అంతస్థుల భవనాలు, నీరు, విద్యుత్తు, రహదారులు నిర్మించటం వల్ల జోషి మఠ్ గ్రామం పెను ప్రమాదంలో పడింది. అసలే ఇక్కడ భూ ఉపరితలం, అంతర్భాగం హిమాలయ పర్వతాల గ్లేషియర్స్ వలన మెత్తని స్వభావం కలిగి ఉంటుంది అని, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణాలు చేపట్టడం సరికాదు అని మిశ్రా కమిటీ ఆ రోజే హెచ్చరించారు. అయితే, ఈ సూచనలు తుంగలో తొక్కి ఆదాయమే పరమావధిగా తలచి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక నిర్మాణాలు చేపట్టడానికి వెసులుబాటు ఇవ్వడంతో నేడు భూమి లోపలి భాగం మెత్తబడి, చివరికి గ్రామంలో అనేక భవంతులు, నిర్మాణాలు, రోడ్లు పగుళ్లు ఏర్పడి, ఏ క్షణాన కూలి భారీ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతోరో అనే భయంతో ఊరు ఊరంతా క్షణాల్లో ఖాళీ చేసేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ముఖ్యంగా సాఫ్టవేర్, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్న తరుణంలో ఖాళీ సమయాల్లో వీకెండ్స్, పండుగ సందర్భంగా దేశంలో ఉన్న వివిధ పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, పుణ్య క్షేత్రాలు చూడడానికి చాలా మంది ఉత్సాహంతో ప్రయాణాలు మొదలుపెట్టారు.ముఖ్యంగా యువత హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న పక్రృతి ప్రాంతా ల్లో విస్తరించడానికి మొగ్గు చూపుతున్నారు. నైనిటాల్, జోషి మఠ్, కులు, మనాలి మొదలైన ప్రదేశాలు చూడడానికి ప్రతీ ఏటా లక్షలాది మంది వస్తుంటారు. వీరికి అవసరమైన విశ్రాంతి గదులు (హోటల్స్, రెస్టారెంట్లు), విద్యుత్ సరఫరా, మంచి నీటి సౌకర్యం, రహదారులు, ప్రయాణ సౌకర్యాలు సాధనాలు కోసం ఆయా ప్రాంతాల్లో ప్రకృతి నిబంధనలకు, భూమి స్థితిగతులు పట్టించుకోకుండా వివిధ రకాల నిర్మాణాలు చేపట్టడం వలన ఆ ప్రాంతాలు ప్రమాదాల్లో పడ్డాయి. అసలే అక్కడ ఉన్న భౌగోళిక, భూగర్భ పరిస్థితులు అననుకూలంగా ఉంటే, ఇక మానవుని అత్యాశ, ఆదాయం సమకూర్చుకోవడానికి, మరెన్నో ప్రకృతి నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలు చేపట్టడం వలన అసలుకే ఎసరు వచ్చింది.

ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా, ముందుగానే హిమాలయ పర్వతాల అనుకుని ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలు నిర్మాణాలపై దృష్టి సారించాలి. భూగర్భ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా పర్యాటక శాఖ అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ మీదే మానవ మనుగడ ఉందనే విషయాన్ని మరువరాదు. ఉత్తర కాశీ కూడా ప్రమాదం అంచున నిలబడి ఉందని తెలుస్తోంది. భూగర్భంలో సొరంగాలు తవ్వటం, నీరు, విద్యుత్ రహదారులు నిర్మించటం కోసం అక్రమ త్రవ్వకాల చేపట్టరాదు. వివిధ రకాల మెటల్స్, మినరల్స్ కోసం అక్రమ త్రవ్వకాలు, అడవులు నరికివేత చేపట్టరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని. ప్రజల ప్రాణా లు కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి. ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. నిఘా పెంచాలి. మరింత తనిఖీ అధికారులు, సిబ్బందిని నియమించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలి. ప్రకృతి కన్నెర్ర చేయకముందే, మానవ స్వార్ధానికి చెక్ పెట్టాలి. సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడి అనుసరిస్తూ ముందుకు సాగాలి..

రావు శ్రీ
9948272919

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News