గత పాతికేళ్లలో పాత్రికేయం తన రూపురేఖలు మార్చుకుని, కొత్త పుంతలు తొక్కింది. ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, అటు తర్వాత డిజిటల్ మీడియా ఆవిర్భవించడంతో వార్తాసేకరణలోనూ, న్యూస్ ప్రెజంటేషన్ లోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియాకు ఉండే పరిమితులు, స్వీయనియంత్రణలు, లక్ష్మణరేఖలు ఇప్పుడు డిజిటల్ మీడియాలో అంతగా కనిపించడం లేదు.స్వీయ నియంత్రణ పాటించవలసిన మీడియా.. హద్దులను అతిక్రమించి, కట్టు తప్పి ప్రవర్తించడమూ కొండొకచో జరుగుతూనే ఉంది. సామాజిక మాధ్యమాల్లోఅబద్ధపు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు, అసత్య ప్రచారాలు మితిమీరుతున్నాయి. ఈ రకమైన విశృంఖలతకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ముఖ్యమంత్రి సైతం పిలుపునివ్వడంతో
పాత్రికేయం అంటే ఏమిటో నిర్వచించడంతోపాటు,
పాత్రికేయులలో అసలు పాత్రికేయులు ఎవరో నిగ్గుతీయవలసిన రోజు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియాకున్న, ఉండవలసిన నైతిక విలువలు, హద్దులు ఏమిటి? పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి? విలువలతో కూడిన, బాధ్యతాయుత పాత్రికేయం కోసం కొత్తగా గీయవలసిన లక్ష్మణరేఖలు ఏమిటి? అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి.దీనిపై వివిధ రంగాలకు చెందిన మేధావులు, పాత్రికేయ ప్రముఖుల నుంచి వివరణాత్మకమైన, విశ్లేషణాత్మకమైన వ్యాసాలను ‘మన తెలంగాణ’ ఆహ్వానిస్తోంది. రచయితలు 350- 400 పదాలకు మించకుండా editor@manatelangana.org కు తమ వ్యాసాలను ఈ మెయిల్ చేయవచ్చు.
ఎడిటర్