పాత్రికేయం- ప్రమాణాలు
మారిన సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిస్థితులలో ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నించే సామాజిక మాధ్యమాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా ఉండి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికితెచ్చి సుపరిపాలనలో, అభివృద్ధిలో భాగం కావలసిన జర్నలిస్టులు తమ వ్యక్తిగత ఎజెండాలతో, రాజకీయ ఆలోచనలతో జర్నలిస్ట్ అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు. అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే పత్రికా రంగంలోనూ వచ్చిన మార్పులకు తోడు, సాంకేతిక విప్లవంతో కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు జర్నలిస్టు అనే పదానికి అర్థం మార్చివేశాయి. కనీస భాషా పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఫోన్ సహాయంతో చానల్ ప్రారంభించి తనకు తోచినట్లుగా తన భావాలను వెల్లడించే అవకాశం ఏర్పడింది. కానీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛ అనే ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తూ, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ అసత్యాలను, అర్ధసత్యాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి.
2014 తరువాత కేంద్ర, రాష్ట్రాలలో ఏర్పడ్డ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల అండదండలతో యూట్యూబ్ ఛానళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం, వీటిలో ప్రసారం అయ్యే అంశాలు ఎంతగా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటే అంత ఎక్కువగా ప్రచారం కావడంవల్ల వీటి నిర్వాహకులు అంతకంతకు రెచ్చిపోతున్నారు. వార్తా ప్రచురణలో, ప్రసారంలో విమర్శ, వ్యంగ్యం అనే వాటికి స్థానం ఉంది. రాజకీయ నాయకులే కాదు, అధికారులు చేసే పొరపాట్లను, ఆశ్రిత పక్షపాతాన్ని ఎండగట్టడానికి ఇవి అవశ్యం కూడా. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో, డిజిటల్ ప్లాట్ ఫారాలలో విమర్శ స్థానంలో జుగుప్సాకరమైన భాషలో తిట్ల దండకం, వ్యంగ్యం పేరిట బూతులు మాట్లాడడం జరుగుతోంది. ఇదేమంటే, ఇదే మా మాండలికం అనే దుర్దశ వచ్చింది. ఏ మాండలికంలోనైనా సభ్యత, సంస్కారం ఉంటుంది. గ్రామీణ భాషలో తిట్టినా దానికి హద్దులు, సరిహద్దులు ఉంటాయి. ఈ ధోరణిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఏర్పరిచే నియంత్రణలు, చట్టాలకన్నా జర్నలిస్టు సంఘాలే ముందుకు రావాలి.
గతంలో జర్నలిస్టు సంఘంలో సభ్యత్వం అంటే అదొక గౌరవంగా ఉండేది. ఒకటి రెండు సంఘాలే ఉండేవి. వివిధ కారణాల వల్ల కోకొల్లలుగా సంఘాలు ఏర్పడడం, ఎవరికీ జర్నలిస్టులపట్ల నియంత్రణ లేకపోవడం,ఈ సంఘాలు కూడా ప్రాంత, కుల, రాజకీయ వర్గాలుగా విడిపోవడం కూడా కారణంగా చెప్పుకోవాలి. జర్నలిస్టు సంఘాల చీలికకు మొదటి కారణం ఆనాటి పత్రికా యజమానుల విభజించి పాలించు అనే ధోరణి ప్రధాన కారణం. పత్రికల్లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో, విలేకరి పేరుకు ముందు వెనక తోకలు తగిలించి, పబ్బం గడుపుకొన్న పత్రికల యాజమాన్యాలు పాత్రికేయ వృత్తిని భ్రష్టు పట్టించాయి. కనీస భాష, సంస్కారం లేకుండా, అసభ్యకరంగా, ఆక్షేపణీయంగా మాట్లాడేవారిని కట్టుదిట్టం చేయాలంటే పాత్రికేయ సంఘాలన్నీ తమలోని వైయక్తిక విభేదాలను మరిచి, ఒక ఐక్యవేదికగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చట్టాలు చేయడం, వాటిపై గగ్గోలు పెట్టడానికి బదులుగా పాత్రికేయులే తమకు తాము నియంత్రణను ఏర్పాటు చేసుకోవడం ఆరోగ్యకరం.
ఇక ఎవరు జర్నలిస్టులు అంటే, ప్రతి యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు, ప్రతి డిజిటల్ ప్లాట్ ఫామ్ నిర్వాహకుడు కనీస విలువలతో కూడిన స్వీయ నియంత్రణను పాటించేలా ఒక మార్గదర్శక నియమావళి ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఏళ్ల తరబడి జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా జాప్యం చేయడం సరికాదు. చట్టసభల్లో ఉన్నట్లు అసభ్యకరమైన, అప్రజాస్వామికమైన భాష అంటూ కొన్ని నియమాలు ఏర్పరుచుకోవడం అవసరం. ముందుగా జర్నలిస్టుల సంఘాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. పూర్వ సంపాదకులు, లబ్ధప్రతిష్టులుగా పేరొందినవారు ఈ విషయంలో మౌనం వీడాలి. నియంత్రణ పాటించనివారి గుర్తింపును రద్దు చేయడానికి, వారిని ఎలాంటి సమావేశాలకు పిలువకుండా నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
సిహెచ్ వి ప్రభాకర్‌రావు
(సీనియర్ జర్నలిస్ట్)