Wednesday, January 22, 2025

ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ) పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావడాన్ని ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ రోగం ఈ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దేశం గణతంత్ర రాజ్యంగా అవతరిస్తూనే ఈ రోగాన్ని వెంట పెట్టుకొచ్చింది. గణతంత్రం ప్రజాతంత్రం కాకముందే వలస పాలనలో కంటే దారుణంగా పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల విధింపు కోసం ఘనత వహించిన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ చేశారు. అనంతర కాలంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ స్వేచ్ఛను నిరోధించే లేదా మరింతగా నియంత్రించే చట్టాలను తేవడానికి ప్రయత్నించాయి. ఇదిలా ఉంటే పాత్రికేయులపై ప్రైవేట్ వ్యక్తుల, రాజకీయ నాయకుల దాడుల గురించి చెప్పాల్సిన పనే లేదు.

ఏడాదికేడాది ఇవి పెరుగుతున్నాయని ఢిల్లీలోని సెంట్రల్ క్రైమ్ బ్యూరో రికార్డులే చెపుతున్నాయి. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం అనేది మన దేశ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణలో ఒక భాగం. ఈ సవరణ ఒక సంచలనం. దీని కోసం ఒక సమరమే జరిగిందంటే అతిశయోక్తి కాదు. దేశ దశ దిశనే మార్చిన ఈ సవరణ రెండంచుల పదును కల కత్తి లాంటిది. ఈ సవరణ వల్ల దేశానికి మంచీ జరిగింది చెడూ జరిగింది. మంచి ఏంటంటే 1 జమీందారీ వ్యవస్థ రద్దు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగ భద్రత చేకూరింది. 2 సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పురోగతికి ప్రభు త్వం తీసుకునే చర్యలకు రాజ్యాంగపరమైన ఆటంకాలు తొలగిపోయాయి. ఇక చెడు విషయానికి వస్తే 1 భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించే ఏర్పాటు జరిగింది. దరిమిలా రాజద్రోహం నేరం సుస్థాపితమైంది. 2 రాజ్యాంగ విరుద్ధంగా వున్న చట్టాలను చెల్లుబాటు చేసేలా న్యాయ సమీక్షకు కత్తెరవేసి సదరు చట్టాల రక్షణకు తొమ్మిదో షెడ్యూలును సృష్టించింది.

అయితే ఈ సవరణ పద్ధతి ప్రకారం జరిగిందనుకుంటే పొరపాటే. సవరణకు చేపట్టిన అంశాలలో కొన్ని మంచివైనా సవరణకు అనుసరించిన మార్గం చాలా ప్రజాస్వామికమైనది. ఎలా అంటే దేశ తొలి సార్వత్రిక ఎన్నికలు జరగక ముందే ఈ సవరణ చట్టాన్ని తాత్కాలిక పార్లమెంటుచే ప్రధాన మంత్రి నెహ్రూ ఆమోదింప చేశారు. ఈ ఆమోదం కోసం ఏకంగా ఆ ఎన్నికలనే ఆయన ప్రభుత్వం వాయిదా వేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 16 నెలలకే ఈ సవరణ చట్టాన్ని తెచ్చారు. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు రాజ్యాంగం ఆటంకంగా ఉందని చెప్పి ప్రజాస్వామ్య పతాక కీర్తి గడించిన నెహ్రూ ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చారు.

ఏకంగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పార్లమెంటు స్పీకర్ మౌలాంకర్ ఈ సవరణ చట్టం తీసుకురావడం పట్ల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాం గ సవరణకు ఇది సరైన సమయం కాదని తొలి ఎన్నికలు జరిగి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎరిగిన బాధ్యతాయుతమైన ఉభయ సభల పార్లమెంట్ ఏర్పడేంత వరకు నిగ్రహించాలని ప్రధాన మంత్రి నెహ్రూకు వారు వేరు వేరు లేఖలు రాశారు. అయినా వారి అభ్యంతరాలను, అభ్యర్థనలను లక్ష్యపెట్టక పక్కకు నెట్టి ప్రధాని నెహ్రూ పంతంపట్టి సవరణ చట్టాన్ని ఆమోదింప చేసుకున్నారు.ఇందులో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షల కోసం జరిగిన సవరణ గురించి తెలుసు కుందాం.
పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు

1950 ఫిబ్రవరి 11న మద్రాస్ రాష్ట్రంలోని సేలం సెంట్రల్ జైల్లో ఒక సంఘటన జరిగింది. ఆ జైల్లోని 200 మంది కమ్యూనిస్టు ఖైదీలు తమను సాధారణ ఖైదీలుగా కాక రాజకీయ ఖైదీలుగా చూడాలని డిమాండ్ చేస్తూ గణతంత్ర రాజ్యాంగా దేశం అవతరించిన జనవరి 26 ననే జైలు అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించారు. సాధారణ ఖైదీల్లా నల్లటోపీలు ధరించాలనే, పనులు చేయాలనే జైలు అధికారుల ఆదేశాలను వారు పాటించలేదు. వారు తమ వినతిపత్రం ఉపసంహరించుకునేలా చేయాలని పోలీసు దళం ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో జరిగిన ఘర్షణలో డిప్యూటీ జైలర్‌తో సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. కమ్యూనిస్టుల ధిక్కారాన్ని పోలీసులు సహించలేకపోయారు. వెంటనే ఆ రెండు వందల మంది కమ్యూనిస్టు ఖైదీలను తప్పించుకోవీలులేని ఒక హాల్‌లోకి పంపి తాళంవేసి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 19 మంది ఖైదీలు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసుల దమనకాండలో మరో ఐదుగురు మరణించారు. మొత్తంగా ఈ 22 మందిలో 19 మంది కేరళకు ఇద్దరు తమిళనాడుకు చెందినవారు. ఒకరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతని పేరు షేక్ దావూద్. 107 మంది గాయపడ్డారు. ఇది జలియన్ వాలాబాగ్ ను తలపించిన ఘోర చర్య.

మద్రాస్ ప్రభుత్వం సమర్ధించుకున్న ఈ అమానుష రాక్షస చర్య కమ్యూనిస్టు భావజాలంతో సంబంధం లేని వారిని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. కల్లోలపరిచింది. హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ మద్రాస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ చర్య వలస పాలనలోని పోలీసు చర్యలా ఉందని ప్రజలు భావిస్తున్నారని, పోలీసుల పట్ల ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నదని ప్రజల మద్దతు కోల్పోతున్నామని పటేల్‌కు నెహ్రూ లేఖ రాశారు.
పత్రిక పంపిణీ పై నిషేధం

సేలం జైలు ఉదంతం పై దేశవ్యాప్తంగా చాలా మంది తీవ్రంగా స్పందించారు. బొంబాయి కేంద్రంగా క్రాస్ రోడ్స్ (Cross Roads ) అనే ఆంగ్ల వారపత్రిక వెలబడుతుంది. రమేష్ థాపర్ అనే యువకుడు దీని సంపాదకుడు, ముద్రాపకుడు, ప్రచురణకర్త. ఇతను ఎవరో కాదు ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ కు స్వంత అన్న. కమ్యూనిస్టుల పోరాటాలు ఉద్యమాల పట్ల రమేష్ సానుభూతితోఉంటాడు. సేలం జైల్లో పోలీసుల దౌర్జన్యాన్ని, దమన కాండను తీవ్రంగా విమర్శిస్తూ తన పత్రికలో రమేష్ వరుసగా వ్యాసాలు ప్రచురిస్తాడు. అప్పటికే పోలీస్ చర్య పట్ల వ్యక్తం అవుతున్న వ్యతిరేకతకు తోడు రాష్ట్రంలో పలుచోట్ల కమ్యూనిస్టు కార్యక్రమాలకు పెరుగుతున్న మద్దతును చూసి భయపడిన మద్రాస్ ప్రభుత్వం మద్రాస్ ప్రజా భద్రత నిర్వహణ చట్టం కింద మద్రాస్ రాష్ట్రంలో క్రాస్ రోడ్స్ పత్రిక పంపిణీ నిషేధిస్తూ మార్చి ఒకటో తేదీన ఉత్తర్వు జారీ చేసింది. దీంతో నిజాలను చూసి కాంగ్రెస్ పాలకులు భయపడుతున్నారని ఇందుకు తన పత్రికపై నిషేధమే రుజువని విరుచుకుపడతాడు. తన పత్రిక పంపిణీపై నిషేధాన్ని సవాల్ చేస్తూ ఏప్రిల్ రెండవ వారంలో సుప్రీం కోర్టులో రమేష్ పిటిషన్ వేస్తాడు.

థాపర్‌తో మద్రాస్ ప్రభుత్వ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఢిల్లీలో మరో పత్రికతో ప్రభుత్వానికి ఘర్షణ ఏర్పడింది. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వారపత్రిక ‘ఆర్గనైజర్’తో. 1950 ఫిబ్రవరిలో తూర్పు పాకిస్తాన్‌లోని కొన్ని చోట్ల, ఢాకా నగరంలో మత కలహాలు పెద్దఎత్తున జరిగాయి. పశ్చిమ బెంగాల్లోకి వేలాది మంది హిందువులు వలస వచ్చారు. ఈ పరిస్థితుల్లో నెహ్రూను, పశ్చిమ బెంగాల్ నుండి తూర్పు పాకిస్తాన్‌కి వలస వెళ్లిపోయినటువంటి ముస్లింల ఆస్తులపై ఆయన విధానాన్ని విమర్శిస్తూ ఆర్గనైజర్ కొన్ని వార్తలు ప్రచురించింది. వీటిలో భాగంగా నెహ్రూ పైన పాకిస్తాన్ ప్రధాని లేఖ లియాఖత్ అలీ ఖాన్ పై కొన్ని కార్టూన్లు వేసింది. వీటిని పరిశీలించడానికి మార్చి రెండవ తేదీన కేంద్ర పత్రిక సలహా కమిటీ సమావేశమైంది. అదే రోజు తూర్పు పంజాబ్ ప్రజా భద్రతా చట్టం క్రింద ఆర్గనైజర్‌కు ప్రి సెన్సార్షిప్ ఉత్తర్వులను ఢిల్లీ చీఫ్ కమిషనర్ జారీ చేశారు. దీంతో క్రాస్ రోడ్స్ పిటిషన్ వేసిన కొద్ది రోజులకే అనగా 1950 ఏప్రిల్ 10న ఆర్గనైజర్ పత్రిక ఎడిటర్, ముద్రాపకుడు మల్కానీ, బ్రిజ్ భూషణ్‌లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగమే వారికి ప్రాథమిక ఆయుధం.

కెఎస్‌ఎన్ ప్రసాద్
9492522089

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News