Wednesday, January 22, 2025

బీహార్‌లో జర్నలిస్టు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో ఓ ప్రముఖ దినపత్రికలో పని చేస్తున్న జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. అరారియా జిల్లా ప్రేమ్‌నగర్ గ్రామంలోతన ఇంటిలోనే జర్నలిస్టు విమల్‌కుమార్ యాదవ్( 35) గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో దుండగులు యాదవ్ ఇంటి తలుపులు తట్టారని, యాదవ్ తలుపులు తెరవగానే దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో అతను అక్కడికకడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే జిల్లా పోలీసు చీఫ్, రాణిగంజ్ పోలీసు స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్కాడ్‌ను కూడా పిలిపించామని అరారియా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ సింగ్ చెప్పారు. కాగా ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

కాగా పాట్నాలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఈ హత్య గురించి అడగ్గా తాను కూడా ఈ సంఘటనపై చాలా బాధపడుతున్నానని, సంఘటనపై తక్షణం దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులను కోరానని నితీశ్ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ హత్యపై ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. బీహార్‌లో ప్రజాసావమ్యం ప్రమాదంలో ఉందని విమర్శించాయి. నేరగాళ్లు స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని, జర్నలిస్టులు సహా అమాయక పౌరులు, చివరకు పోలీసు అదికారులు హత్యకు గురవుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు. కాగా బీహార్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని నితీశ్ కుమార్, ఆయన మిత్రులు గగ్గోలు పెడుతున్నారని, కానీ వాళ్లు ఫోర్త్ ఎస్టేట్(పత్రికా రంగం)కు కూడా రక్షణ కల్పించలేకపోతున్నారని లోక్‌జనశక్తి పార్టీ మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. సమస్తిపూర్‌లో ఇటీవల పోలీసు అధికారి హత్యను ప్రస్తావిస్తూ సామాన్య ప్రజలు ఎప్పుడో నితీశ్ కుమార్‌పై నమ్మకాన్ని కోల్పోయారని, అయితే ఆయన ప్రభుత్వం పోలీసులు, ప్రెస్‌ను సైతం కాపాడలేకపోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News