Thursday, January 9, 2025

బీహార్‌లో జర్నలిస్టు కాల్చివేత

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లోని అరారియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒక హిందీ దినపత్రికలో పనిచేస్తున్న విమల్ కుమార్ యాదవ్(35)ను ప్రేమ్‌నగర్ గ్రామంలోని ఆయన నివాసంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.

తెల్లవారుజామున 5.30 గంటలకు యాదవ్ ఇంటి తలుపులు తట్టిన దుండగులు ఆయన తలుపులు తెరిచిన వెంటనే కాల్పులు జరిపినట్లు బీహార్ పోలీసులు ట్వీట్ చేశారు. చాదవ్ అక్కడికక్కడే మరణించగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్, రాణిగంజ్ ఎస్‌హెచ్‌ఓ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యాదవ్ నివాసం వద్దకు పోలీసు జాగిలాలు, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. మృతుడికి తన పొరుగున నివసించే వ్యక్తతో పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు అరారియా ఎస్‌పి అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.

ఈ ఘటనపై జర్నలిస్టులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోగా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, జర్నలిస్టు యాదవ్ హత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. బీహార్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రతిపక్ష బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News