న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో కూతురు సౌమ్యకు న్యాయం జరిగిందని సంతోషించే లోపలే సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకె విశ్వనాథన్ శనివారం కన్నుమూశారు. సౌమ్య హంతకులకు నవంబర్ 25న జీవితఖైదు పడింది. 82 ఏళ్ల విశ్వనాథన్ విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే , తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచే ఆయన విచారణను కోర్టు అనుమతితో ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. 26 ఏళ్ల సౌమ్య విశ్వనాథన్ తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో 2008లో హత్యకు గురయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఎంకె విశ్వనాథన్, మాథవి విశ్వనాథన్ తన కుమార్తెకు న్యాయం జరిగేలా దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఝ న్యాయపోరాటం చేశారు. 15 ఏళ్ల పాటు వారు కోర్టు విచారణలకు తిరుగుతూనే ఉన్నారు.