Wednesday, January 22, 2025

కవిత ఇంటి వద్ద సంబురాలు

- Advertisement -
- Advertisement -

ఆమె చిత్రపటానికి పాలాభిషేకాలు

మహిళా బిల్లు ప్రవేశపెట్టడంపై ఎంఎల్‌సి కవిత హర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టడంపై బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రతిపాదించిన ప్రతి పార్టీ మద్దతు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం కవిత ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆమె నివాసంలో మహిళా నేతలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపి, భారీగా సంబురాలు చేసుకున్నారు. మహిళా బిల్లు కోసం కవిత భారీ ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్‌లో బిల్లును తీసుకురావాలంటూ ఆమె ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆ తరువాతే మహిళా బిల్లుపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు కేంద్రం మహిళా బిల్లు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. బిల్లులో ఒబిసి రిజర్వేషన్ అంశం చేర్చకపోయినప్పటికీ.. జనగణన పూర్తయ్యే వరకు దానిని చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు.తొమ్మిదిన్నరేళ్లు కేంద్రం తాత్సారం చేసినా.. ఇప్పటికైనా మహిళా బిల్లును కేంద్రం తీసుకురావటం సంతోషకరంగా ఉందని కవిత చెప్పారు. కేంద్రం పారదర్శకంగా ఉండాలని బిల్లు విధి విధానాలను దాయాల్సిన అవసరం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2014లోనే మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు కవిత గుర్తు చేశారు. బిల్లు ఆమోదంతో భారతదేశంలో మహిళలు విశ్వం ముందు తలెత్తుకొని నిలబడేలా ఉంటుందని ఆకాశంలో సగం, భూమిలో సగం అధికారంలో సగమని మహిళా లోకం నినదించినట్లు అవుతుందని కవిత చెప్పారు. తెలంగాణలో కెసిఆర్ సీఎం అయ్యాక చాలా మంది మహిళలు సర్పంచులుగా, ఎంపిటిసిలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు వస్తే సామాన్య మహిళలు అసెంబ్లీలలో, పార్లమెంటులో వెళ్లడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

మహిళల కల సాకారం కాబోతున్నది : కవిత
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బిఆర్‌ఎస్ కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికారంలో సగం కావాలన్న మహిళ కల సాకారం కాబోతున్నదని, ఇది దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 33 శాతం మహిళా రిజర్వేషన్, ఒబిసి రిజర్వేషన్లను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఒబిసి, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. లోక్‌సభలో అధికార పార్టీకి పూర్తిస్థాయి మెజారీటీ ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని కవిత అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News