మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, విచ్చలవిడిగా అప్పులు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్ కళాశాల మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన బిజెపి గోదావరి గర్జన’ సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ ఎపి సిఎం కేంద్ర నిధులు, పథకాలు దారి మళ్లించారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో ఎపిలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరి ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పోవాలి..బిజెపి రావాలి అనే నినాదానిచ్చారు. ఎపి రాష్ట్రం ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోందని, 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవన్నారు. గతంలో బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదని, మోదీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తెచ్చారన్నారు. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న నేతలు:
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బి.జె.పి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా దర్శించుకున్నారు. ఆయనతో పాటు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహా రావు, బి.జె.పి జాతీయ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్‌లకు ఆలయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు.
JP Nadda slams AP CM Jagan over Borrows