జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) కాలపరిమితి పెంచేందుకు లోక్‌సభ అంగీకరించింది. ఒక దేశం ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) నిమిత్తం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జెపిసిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. తాజాగా జెపిసి చైర్మన్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి పిపి చౌదరి గడువు హెచ్చింపు కోసం తీర్మానాన్ని లోక్‌సభలో ప్రతిపాదించారు. సభ మూజువాణి వోటుతో తీర్మానానికి ఆమోదం తెలిపింది. రాజ్యసభ నుంచి ఒక కొత్త సభ్యుని కమిటీలో చేరుస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభకు తెలియజేశారు. రాజ్యసభ నుంచి వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి రాజీనామాతో 39 మంది సభ్యుల కమిటీలో ఒక ఖాళీ ఏర్పడింది.
జమిలి ఎన్నికలపై జెపిసిని గత శీతాకాల సమావేశాల్లో ఏర్పాటు చేశారు. కమిటీ కాలపరిమతి ప్రస్తుత సమావేశాల చివరి వారం మొదటి రోజున ముగియవలసి ఉన్నది. కాగా, రానున్న వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు కమిటీ గడువును సభ పొడిగించింది. 39 మంది ఎంపిలతోఏర్పాటు చేసిన జెపిసి ఈ బిల్లును అధ్యయనం చేస్తోంది. కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి కమిటీ కాలపరిమితి ఏప్రిల్ 4న ముగియనున్నది. బిల్లుపై చేయవలసిన పని ఇంకా మిగిలి ఉందని అధికార వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో జెపిసి గడువు పొడిగించే తీర్మానానికి లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలియజేసింది.