న్యూఢిల్లీ : లోక్‌సభ వెబ్‌సైట్ పోస్ట్ చేసిన షెడ్యూల్ ప్రకారం, జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) రెండవ సమావేశం ఈ నెల 31న జరుగుతుంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టగా వాటిని కమిటీకి నివేదించడమైంది. లోక్‌సభ వెబ్‌సైట్ ప్రకారం, సవరణ బిల్లుల పరిశీలనకు సంబంధించిన ప్రక్రియ, పద్ధతులపై రానున్న సమావేశంలో చర్చిస్తారు. కమిటీ తన తొలి సమావేశాన్ని ఈ నెల 8న నిర్వహించింది. ఆ సమావేశంలో కేంద్ర న్యాయ (శాసన విభాగం) మంత్రిత్వశాఖ ప్రతినిధులు సభ్యులకు వివరించారు. పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశంలో పరస్పర భిన్నాభిప్రాయాల మార్పిడి జరిగింది.
ఆ బిల్లులను రాజ్యాంగం మౌలిక స్వరూపం, ఫెడరల్ వ్యవస్థపై దాడిగా ప్రతిపక్ష సభ్యులు విమర్శించగా, ప్రజాభిప్రాయాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయని బిజెపి ఎంపిలు కొనియాడారు. హిందీ, ఇంగ్లీష్‌లలోని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికల సంపుటి, 21 సంపుటాల అనెగ్జర్, విడిగా ఒక రాజ్యాంగం ప్రతి సహా 18 వేల పేజీలతో కూడిన ఒక ట్రాలీని అందరు ఎంపిలకు అందజేశారు. బిజెపి ఎంపి పిపి చౌదరి సారథ్యంలోని 39 మంది సభ్యుల కమిటీలో ప్రియాంక గాంధీ వాద్రా (కాంగ్రెస్), సంజయ్ ఝా (జెడియు), శ్రీకాంత్ షిండే (శివసేన), సంజయ్ సింగ్ (ఆప్), కల్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే (టిఎంసి) సహా అన్ని ప్రధాన పార్టీల నుంచి సభ్యులు ఉన్నారు. మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పరుషోత్తమ్ రూపాల, మనీష్ తివారితో పాటు పలువురు ఇతర ఎంపిలు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు.