Thursday, January 23, 2025

గడువు ముగిసినా… సమ్మె కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

గడువు ముగిసినా… సమ్మె కొనసాగింపు
ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తాం : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
మనతెలంగాణ/ హైదరాబాద్: సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటకీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గలేదు. మంగళవారం సాయంత్రం ఐదు దాటిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె కొనసాగించారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పంచాయతీ కార్యదర్శులు సమ్మె కొనసాగిస్తుండటంతో ప్రభుత్వం తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెపై అగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమ్మెను విరమించి మే 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని గడువు విధించింది. ఈ సమయం కల్లా రిపోర్ట్ చేయని వారిని విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది.

కొందరూ విధుల్లోకి…
లక్షెట్టిపేట మండల పరిషత్ పరిధిలోని బలరావుపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోతుల శృతి విధుల్లో చేరుతున్నట్లు రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రతక్షమైంది. తాను విధులలోకి చేరుతున్నట్లు ఆమె పేర్కొంది.

సమ్మెను కొనసాగిస్తాం: జూనియర్ కార్యదర్శులు
తమకు నోటీసులు జారీ చేసినా.. న్యాయ బద్ధమైన సమస్యల సాధనకు సమ్మెను కొనసాగిస్తామని రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం తెలిపింది. సంఘం గౌరవ అధ్యక్షుడు సందీప్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మంగళవారం సాయంత్రం వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించినా జెపిఎస్‌లు అంతా ఏకతాటిపై నడిచి సమ్మెలోనే ఉండాలని నిర్ణయించారని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తమ సమ్మెకు అన్ని వర్గాల మద్దతు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని సంఘం కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News