Saturday, December 21, 2024

జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష వాయిదా, 15 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లో పంచాయతీ జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆదివారం ఉదయం జరగాల్సి ఉండగా, పేపర్ లీక్ కావడంతో పరీక్ష వాయిదా పడింది. 1181 పోస్టులకు సుమారు 9.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో మొత్తం 2995 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పేపర్ లీక్ గురించి గాంధీనగర్ లోని గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలెక్షన్ బోర్డుకు సమాచారం అందడంతో యాంటీ టెర్రరిస్టు స్కాడ్ (ఏటీఎస్) రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి 15 మందిని వడోదరలో అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు గుజరాత్‌కు చెందిన వారు కాగా, పది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.

హైదరాబాద్‌లో ప్రశ్నాపత్రం ముద్రణ?
విశ్వసనీయ సమాచారం మేరకు ఓ అనుమానితుడ్ని అదుపు లోకి తీసుకొని విచారించగా, అతని వద్ద ప్రశ్నపత్రం లభించినట్టు తెలిసింది. ఈ ప్రశ్న పత్రాన్ని హైదరాబాద్ లోనే ముద్రించినట్టు సమాచారం. ఈ మేరకు సదరు ప్రింటింగ్ ప్రెస్‌పై కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని సెలెక్షన్ బోర్డు పేర్కొంది. అయితే పరీక్ష వాయిదా సంగతి తెలుసుకున్న అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఆందోళనకు దిగారు. పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నా పత్రం లీక్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశ్న పత్రాల లీక్ ప్రధాన అంశంగా తెరమీదకు వచ్చింది. ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాజాగా ఆయన స్పందిస్తూ గుజరాత్ లోనే ఇలా ఎందుకు జరుగుతోందో? అని ట్విటర్ వేదికగా సందేహం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News