మనతెలంగాణ: డీజిల్ పేరుతో మోసం చేస్తూ డబ్బులు కొట్టేసిన అన్నపూర్ణ సూడియో క్యాషియర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భరత్ మణి(34) ఆరేళ్ల నుంచి అన్నపూర్ణ సూడియోలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. స్టూడియోలో జరిగే టివి సీరియల్స్ షూటింగ్, ఓటిటిలో ప్రసారాలకు సబంధించిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను భరత్ మణి చూసుకుంటున్నాడు. రోజు వారీగా వచ్చే ఆదాయంతో పాటు నిర్వహణ ఖర్చులు, చెల్లింపులు చేస్తాడు. ఈ క్రమంలోనే భరత్ ఇటీవల డీజిల్ కింద రూ.30,000 బిల్లు వచ్చినట్లు లెక్కల్లో చూపించాడు. దీనిపై అనుమానం వచ్చిన సంస్థ యాజమాన్యం డీజిల్ బిల్లులపై ఆడిటింగ్ నిర్వహించింది. దీంతో డీజిల్ పేరుతో చేసి మోసం బయటపడింది. భరత్ మణి డీజిల్ పేరుతో సుమారు రూ.12లక్షల మేరకు మోసం చేసినట్లు తేలడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఆపరేషన్స్ జిఎం అన్నే చిరంజీవి, గీతాధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Jubilee Hills Cop filed case against Annapurna Studios Cashier