హైదరాబాద్: జూబ్లీహిల్స్ డివిజన్ లో జిహెచ్ఎంసి ఆర్‌పిలు, బిఎల్ఓతో కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… డివిజన్ లో గత ఎనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్నఓటర్ ఐడి కార్డులను, త్వరితగతిన ధ్రువీకరణ చేయాలన్నారు. పేదవారికి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.
దీంతో అర్హులైన బడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని కార్పొరేటర్ పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించాలని ఆయన వెల్లడించారు. ఆర్ పిలు, బిఎల్ఓలకు ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ వెంకటేష్ సూచించారు. ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణలకు సెప్టెంబర్ 19వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఇప్పటికే సూచించారు.