హైదరాబాద్: తొలుత స్నేహం చేశాడు అనంతరం ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి నుదట సిందూరం పెట్టి పెళ్లిందని నమ్మించాడు. ప్రేమ పెళ్లి పేరుతో యువతిపై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అనంతరం ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయి ప్రణీత్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఒడిశాకు చెందిన యువతి ప్రొస్థిటిక్ ఆర్థోటిక్ క్లినిక్‌లో పని చేసేది. యువతిని మాయమాటలతో పరిచయం చేసుకున్నాడు. వీరి స్నేహం ప్రేమగా మారడంతో కేరళలో విహారయాత్రకు వెళ్లారు. హోటల్‌లో ఆమె నుదట సిందూరం పెట్టి పెళ్లియిందని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు.
2023 డిసెంబర్‌లో శిర్డీకి యువతితో కలిసి వెళ్లాడు. అక్కడ తన తల్లిదండ్రులు, చెల్లిని పరిచయం చేశాడు. అక్కడి నుంచి గోవాకు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. 2024లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఉద్యోగ నిమిత్తం షిప్ట్ అయ్యాడు. జూబ్లీహిల్స్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఇద్దరు ఉంటున్నారు. చెల్లికి పెళ్లి ఉందని చెప్పి సొంతూరు మంచిర్యాలకు వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు. అనుమానంతో అతడిని యువతి నిలదీసింది. 20 లక్షల రూపాయలు ఇస్తానని, తనతో బంధం తెంచుకోవాలని చెప్పడంతో యువతి అవాక్కయింది. వెంటనే తేరుకొని జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.