Monday, December 23, 2024

సంపాదకీయం: సమాజానికి మచ్చ

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession ఇరవై ఏళ్ల లోపు బడి పిల్లలు పబ్‌లలో తాగి తందనాలాడడం, అంది వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడడం మన సమాజాన్నే బోనులో నిలబెడుతున్న అంశం. ముఖ్యంగా అమితమైన ధనం, అధికారం గల సంపన్న వర్గాల పిల్లలు బడా కార్పొరేట్ బడుల్లో నేర్చుకొంటున్న చదువును నేరస్థురాలిని చేస్తున్న విషయం. మొన్న శనివారంనాడు హైదరాబాద్‌లోని సంపన్న వర్గాలుండే జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేసియా క్లబ్‌లో పగటి పూట 180 మంది 11, 12 తరగతుల కార్పొరేట్ బడి పిల్లలు గెట్ టు గెదర్ పార్టీ చేసుకోడం, ఆ పార్టీకి కొందరు పిల్లలు పదిహేడేళ్ల అమ్మాయితో రావడం, పార్టీ ముగిసిన తర్వాత సాయంత్రం వారు ఆమెను ఇన్నోవా కారులో తీసుకు వెళ్లి నిర్జన ప్రదేశంలో బయట ఒకరిని కాపలా వుంచి వంతులవారీ రేప్ చేయడం యెంతటి దారుణమో వివరించి చెప్పనక్కరలేదు.

ఈ అమానుషానికి పాల్పడినవారిలో ఎంఐఎం పార్టీ ఎంఎల్‌ఎ కుమారుడు సహా ఉన్నత పదవుల్లోని వారు ఉన్నారని వార్తలు చెబుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు నలుగురు పిల్లలను అదుపులోకి తీసుకోడం, వారిని రిమాండ్‌కు పంపడం జరిగింది. వారిలో మైనర్లు కూడా ఉన్నారు. సమాజంలోని అత్యున్నత స్థాయికి చెందిన కుటుంబాల నుంచి వచ్చి అతి గొప్పవిగా పరిగణన పొందుతున్న పాఠశాలల విద్యార్థులు చేసినట్టు చెబుతున్న నేరం కాబట్టి అందరి దృష్టి దీనిపై పడింది. సహజంగానే పోలీసులపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి వుంటుంది. రాజకీయ రచ్చ అత్యధిక స్థాయిలో వుండడం సహజమే. ఈ నీచాతి నీచ ఘటనలో ఎంఐఎం ఎంఎల్‌ఎ కుమారుడు లేడని, అంతకు ముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెబుతున్నారు. పబ్‌లో ఈ పార్టీ జరిగినప్పుడు మద్యం సరఫరా చేయలేదని, దానికి తాళం వేశామని పబ్ మేనేజర్ చెప్పాడు. అంతటి పలుకుబడి గల కుటుంబాల విద్యార్థులు రెండు లక్షల రూపాయిలు చెల్లించి పబ్‌ను యీ కార్యక్రమానికి బుక్ చేసినట్టు తెలుస్తున్నది. వారు ఒత్తిడి చేసి బార్ తాళాలు తెరిపించి మద్యం సేవించి ఉండరని అనుకోడానికి లేదు.

దాని ప్రభావంతోనే వారు యీ అఘాయిత్యానికి అసాంఘిక దుర్మార్గానికి పాల్పడి ఉండవచ్చు. దర్యాప్తులో యీ విషయం తెలియవలసి వుంది. అంత మంది మగ పిల్లలు, యుక్త వయసుకు చేరువలోని వారు కలిసిన చోటుకి పదిహేడేళ్ల బాలికను పబ్ వారు యెలా అనుమతించారు అనేది కీలకం. అలాగే ఆ పిల్లలు ఏ పాఠశాలకు లేదా పాఠశాలలకు చెందినవారు అనేదీ తప్పనిసరిగా తెలియవలసిన అంశం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోనే గత ఏప్రిల్ తొలి వారంలో ఒక ఆదివారం తెల్లవారు జామున ఒక పబ్‌లో 150 మంది మాదక ద్రవ్యం (కొకైన్) సేవిస్తూ పట్టుబడిన ఉదంతం సంచలనం రేపింది. అలా పట్టుబడిన వారిలో సెలబ్రిటీస్ కూడా వున్నట్టు వార్తలు తెలియజేశాయి. అది డ్రగ్స్ కేసయితే, యిది రేప్ దారుణం. అక్కడ యిక్కడ కూడా సంపన్నులు, పలుకుబడి గలవారే. వీరి వద్ద గల అపారమైన ధనం, రాజకీయ పలుకుబడే యీ దారుణాలను జరిపిస్తున్నది. అమెరికాలో బడుల్లో కాల్పుల ఘటనలతో సరిపోల్చదగిన ఘాతుకాలివి.

మన చదువుల్లో మానవీయ విలువలను నేర్పే అంశాలు బహు తక్కువ. ఒకవేళ అవి వున్నా పురాణ గాథల నుంచి తీసినవే అవుతాయి. తలిదండ్రులను, గురువులను భక్తితో గౌరవించడం వంటి నీతులు చెప్పేవే ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో సాటి మనిషిని తనతో సమానంగా చూడడం, రాజ్యాంగం మహిళలకు, సామాజికంగా అణగదొక్కబడిన వర్గాలకు కల్పించిన హక్కులను గౌరవించి మానవత్వం గరిష్ఠ స్థాయిలో విలసిల్లే సమాజాన్ని నిర్మించుకొనే వైపు అడుగులు వేయడం, స్త్రీలపై సాగే గృహ హింస, సమాజ హింసల పట్ల అవగాహన కల్పించడం, సంప్రదాయ పురుషాధిక్య, అధిపత్య ధోరణులలోని దుర్మార్గాన్ని గురించి చెప్పడం ఉండవు. అలాగే రేప్, హింస తదితర నేరాలకు శిక్షా స్మృతిలో గల కఠినమైన శిక్షలను గురించి సుబోధకంగా వివరించరు. కేవలం కేరీర్, ఉన్నత ఉద్యోగాలు పొందడం మీదనే దృష్టి సారింపజేసే సాంకేతిక విద్యను, దానినీ మార్కుల కోసం సబ్జెక్టును ముక్కున కరచుకొని జవాబు పత్రం మీద విడిచిపెట్టివచ్చే విద్యనే బోధిస్తున్నారు. గతంలో వుండిన సోషల్ స్టడీస్, చరిత్ర, సివిక్స్ వంటి విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దడంలో ఉపయోగపడే సబ్జెక్టులను సిలబస్ నుంచి తొలగిస్తున్నారు.

పేదల పిల్లలు దారిద్య్రంలో మగ్గుతూ చదువుకు దూరమవుతుంటే, ధనికుల పిల్లలు డబ్బు అజీర్ణంతో సమాజానికి భారమవుతున్నారు. ఈ దుస్థితి తొలగాలంటే ధనిక, పేద విద్యార్థులందరికీ ఉమ్మడిగా ఒకే చోట మరింత మెరుగైన విద్యను బోధించే కామన్ స్కూల్ విధానం అమల్లోకి రావాలి. తలిదండ్రులు సంపాదించిపెట్టిన డబ్బు ఉన్మాదం పిల్లల తలకెక్కకుండా చూడాలి. ఈ ఉదంతంలో ఒక ఎంఎల్‌ఎ కుమారుడినో, ఇతర పెద్దల పిల్లలనో కాపాడడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే అపవాదు ప్రభుత్వంలోని వున్నవారికి అంటకుండా బాధ్యులైన వారందరికీ కఠిన శిక్షలు పడేలా చూడవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News