సంపాదకీయం: జడ్జీల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించే కాల వ్యవధిని పాటిస్తుందని భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు విన్నవించుకోడం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో ఇంత కాలం సుప్రీంకోర్టుపై ధిక్కార ధోరణిలో మాట్లాడుతూ వచ్చిన బిజెపి పాలకులు ఇప్పుడు దారికి వస్తున్నట్టుగానే భావించాలి. కొలీజియం సిఫారుసు చేసిన వారిలో 44 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే చేపట్టనుందని వెంకట రమణి తెలియజేయడం అత్యంత సంతోషదాయకం. ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత నుంచి కేంద్రం కొలీజియం సిఫారుసులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం ప్రారంభించింది.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల అనేక సార్లు కొలీజియం పద్ధతిని దుయ్యబడుతూ అందులో సభ్యులుగా వ్యవహరించే న్యాయమూర్తుల వ్యవహార శైలి మీద కూడా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్‌ల ధర్మాసనం ఈ విషయంలో కేంద్రం వైఖరిని చెరిగి వదిలిపెట్టింది.కొలీజియం ఈ దేశ మూర్తీభవించిన న్యాయమైన రాజ్యాంగ విహితమైనదని, దానిని ప్రభుత్వం విధిగా పాటించి తీరవలసిందేనని తీవ్ర స్వరంతో స్పష్టం చేసింది. సమాజంలోని కొన్ని వర్గాలు కొలీజియంను వ్యతిరేకిస్తున్నంత మాత్రాన అది అంతం కాబోదని కూడా తెలియజేసింది. ఏ చట్టాన్ని అనుసరించాలి, దేనిని తిరస్కరించాలి అనే దానిని ప్రతి ఒక్కరూ నిర్ణయిస్తూ పోతే దేశంలో ఒక పద్ధతి అంటూ లేకుండా పోతుందని సర్వం అస్తవ్యస్తమైపోతుందని హెచ్చరించింది. ఈ దశలో అటార్నీ జనరల్ మాట్లాడుతూ కొలీజియం కూడా కేంద్రం తిరిగి పంపించిన ఇద్దరి పేర్లను తిరస్కరించిన సందర్భాలు రెండున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దానితో అటువంటి అరుదైన సందర్భాలు కొలీజియం మళ్ళీ సిఫారుసు చేసి పంపించే పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి స్వీకరించి తీరాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిర్లక్షం చేయడానికి లైసెన్సును ప్రభుత్వానికి ఇవ్వబోవని సూటిగా చెప్పి మందలించింది.
న్యాయ నియామకాల విషయంలో పాటించవలసిన కాల వ్యవధిని పాటించనందుకు కేంద్రంపై బెంగళూరు న్యాయవాదుల సంఘం, మరో స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతూ ధర్మాసనం ఈ విధంగా కేంద్రాన్ని సునిశితంగా విమర్శించింది. విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఆ ప్రకారం మొన్న శుక్రవారం నాడు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించిన సందర్భంలో జస్టిస్ వెంకట రమణి కొలీజియం సిఫారసులకు అనుగుణంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను ప్రభుత్వం చేపట్టడం ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. కొలీజియం సిఫారసులు అందుకొన్న 18 వారాల్లో ఆ పేర్లకు కేంద్రం సమ్మతి తెలపాలని 2021లో సుప్రీంకోర్టు కాల వ్యవధిని నిర్ణయించింది. న్యాయమూర్తులుగా నియమితులు కావడానికి ఇంత వరకు 104 మంది పేర్లను వివిధ హైకోర్టుల కొలీజియంలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. వీరిలో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా, సీనియర్ న్యాయమూర్తులుగా నియమితులు కావలసిన వారు కూడా వున్నారు. ఒక వైపు పైకోర్టుల్లో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోడం వల్ల పెండింగ్ కేసుల పరిష్కారం నిరంతరం వాయిదా పడుతున్నది.
దేశ ప్రజలకు సకాలంలో న్యాయం అందక వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విచారణలోని ఖైదీలుగా అసంఖ్యాకులు చెప్పనలవికాని బాధలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల సత్వర నియామకం విషయంలో న్యాయ వ్యవస్థకు తోడ్పాటు ఇవ్వవలసిన బాధ్యత దేశ పాలకులపై వుంది. ఆ బాధ్యతను నిర్లక్షం చేసి కేంద్రంలోని బిజెపి పాలకులు న్యాయ నియామకాలను తమ చెప్పుచేతల్లో వుంచుకోడం మీదనే దృష్టి పెడుతూ కొలీజియంల సిఫారసులను పక్కన పెడుతున్నారు. పైపెచ్చు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ కూడా కొలీజియం వ్యవస్థపై తీవ్రమైన విమర్శలకు పాల్పడ్డారు. కేంద్రం తీసుకు వచ్చిన జాతీయ న్యాయ నియామక వ్యవస్థ (ఎన్‌జెఎసి) ఎంత మాత్రం చెల్లుబాటు కాదని తీర్పు ఇస్తూ ఆ వ్యవస్థలో ఇద్దరు బయటివారిని ప్రముఖులుగా భావించి నియమించడానికి అవకాశం కలిగించడాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2015లో తప్పు పట్టింది. న్యాయ వ్యవస్థ పట్ల ఎటువంటి అవగాహన లేని అజ్ఞానులకు ఎన్‌జెఎసిలో చోటు కల్పించదలచుకొంటే సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో కూడా వారిని తీసుకొచ్చి పెట్టండి అని రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర వ్యంగ్య స్వరంతో వ్యాఖ్యానించింది. కేంద్రం దిగి రావడంతో ఈ వివాదానికి తెర పడుతుందని ఆశించవచ్చు.