మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పు బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈక్రమంలో సిఐడి చార్జ్ షీట్‌లో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును అధికారులు ప్రస్తావించారు. దీంతో పాటు వీడియో ఫుటేజ్‌లో ఉన్న వాయిస్ అక్బరుద్దీన్ ఒవైసిదే నిపుణులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెలువరించాల్సి ఉండగా బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసులకు సంబంధించి 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం నిజామాబాద్‌లో హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడటంతో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు అక్బరుద్దీన్‌పై ఐపిసి 120-బి, 153ఎఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి అరెస్టయిన ఆయన 40 రోజుల పాటు జైలుశిక్షను కూడా అనుభవించారు.ఈ కేసుల్లో తుది తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాంపల్లి కోర్టు వద్ద 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాతబస్తీ, నిర్మల్ పట్టణాల్లోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేశంలో రాజకీయ నేతలపై నమోదైన దేశద్రోహం కేసుల్లో వెలువడిన తొలి తీర్పు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.