Saturday, November 9, 2024

హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టులో సవాలు చేస్తా
న్యాయ వ్యవస్థతతో బిజెపి కుమ్మక్కు
బిజెపి సూచనల మేరకే కోర్టు తీర్పులు
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

రాయిగంజ్: టీచర్ నియామక పరీక్ష ద్వారా 2016లో జరిగిన నియామకాలన్నిటినీ రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును చట్ట విరుద్ధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆమె ప్రకటించారు. ఉత్తర బెంగాల్‌లోని రాయిగంజ్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ కొన్ని న్యాయపరమైన నిర్ణయాలను బిజెపి నాయకులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. వారికి న్యాయం లభించేలా పోరాడతామని ఆమె చెప్పారు.

అనంతరం కరన్‌గిడిలో మరో ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ అన్ని తీర్పులను ఆమోదించాల్సిన అవసరం లేదని చెప్పారు. టీచర్ల నియామకాల రద్దుపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో బిజెపి నుంచి వచ్చిన ఆదేశౠల మరకే ఈ ఉత్తర్వు వెలువడిందని ఆమె ఆరోపించారు. బిజెపి న్యాయవ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుంటోందని ఆమె ఆరోపించారు. న్యాయస్థానాలను తన అనుబంధ పార్టీ కార్యాలయాలుగా బిజెపి మార్చిందని మమత ఆరోపించారు. బిజెపి ఏదైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేస్తే తక్షణమే చర్యలు ఉంటాయని, ప్రజలను జైలుకు పంపుతారని ఆమె చెప్పారు.

కాని ఇతరులు పిల్ దాఖలు చేస్తే ఎటువంటి చర్యలు ఉండవని ఆమె ఆరోపించారు. పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారి మధ్య సంబంధాలు బహిరంగంగా అందరికీ కనపడుతున్నాయని ఆమె విమర్శించారు. న్యాయవ్యవస్థలోని కొందరితో బిజెపి కుమ్మక్కయ్యిందని మమత ఆరోపించారు. బిజెపితో కుమ్మక్కయినవారికి ముఖ్యమైన పదవులు లభించాయని, బిజెపి తన పార్టీ కార్యాలయాల నుంచి పంపే సూచనలు తీర్పులుగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ప్రజల హక్కుల కోసం తాను పోరాడుతూనే ఉంటానని ఆమె ప్రకటించారు. తనపై చేపట్టే న్యాయపరమైన చర్యల గురించి తాను ఆందోళన చెందడం లేదని ఆమె స్పష్టం చేశారు. తనను శిక్షించదలిస్తే పరువునష్టం దావా వేసి తనను జైలుకు పంపించాలని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. అయితే ప్రజల హక్కుల కోసం పోరాడే విషయంలో తాను మాత్రం తలవంచే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయామని టీచర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారికి తాను అండగా ఉంటానని ఆమె చెప్పారు. మరో 10 లక్షల ఉద్యోగాలను కల్పించడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News