Sunday, November 24, 2024

ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణపై తీర్పు సబబే

- Advertisement -
- Advertisement -

రివ్యూ పిటిషన్లు చెల్లనేరవు
కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం రూలింగ్
న్యూఢిల్లీ : ఎస్‌సి ఉప వర్గీకరణ (ఎబిసిడి) తీర్పు సమీక్షకు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఎస్‌సిల రిజర్వేషన్ల కోటాలో ఉప కులాల వర్గీకరణకు రాష్ట్రాలు రాజ్యాంగయుతంగా అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పు కోటా సంబంధిత విషయంలో సంచలనానికి దారితీసింది. కోటాలోనే అంతర్గత కోటా కల్పన అంశం పలు స్థాయిల్లో సానుకూల, వ్యతిరేక స్పందనలకు దారితీసింది. తమ ధర్మాసనం ముందుకు వచ్చిన పది రివ్యూ పిటిషన్లను ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సహా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. ఈ తీర్పు విషయంలో ఎటువంటి తప్పిదం జరగలేదని, పొరపాటు అనేది లేదని నిర్థారించినట్లు ధర్మాసనం తెలిపింది.

ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ సభ్యులుగా ఉన్నారు. తమ అప్పీళ్లను ఓపెన్ కోర్టులో విచారణకు స్వీకరించాలనే వాదనను కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమ కీలక తీర్పు 2013 సుప్రీంకోర్టు రూల్స్‌కు అనుగుణంగా వెలువరించడం జరిగింది. సంబంధిత ఏ నిబంధనలకు అనుగుణంగా కూడా పిటిషన్లకు అనుగుణంగా సమీక్ష జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్లు బెంచ్ పేర్కొంది. ఎబిసిడి కోటా విషయంలో వెలువడిన తీర్పులో విరుద్ధ తీర్పు వెలువరించిన జస్టిస్ త్రివేది కూడా ఇప్పుడు పిటిషన్లను తిరస్కరించిన ధర్మాసనంలో ఒక్కరిగా ఉన్నారు. అన్ని రివ్యూ పిటిషన్ల పరిశీలన జరిగింది. ఇంతకు ముందటి తీర్పు సక్రమం అని నిర్థారణ జరిగింది. ఇక 2013 సుప్రీంకోర్టు రూల్స్‌లోని ఆర్డర్ రూల్ 1 మేరకు కూడా సమీక్షకు వీలు లేదని తేల్చిచెప్పారు.

ఎబిసిడి వర్గీకరణకు సంబంధించి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌సిలలోనే కొన్ని ఉప కులాలు సామాజికంగా , ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున వారి అభ్యున్నతికి వీలుగా ఉప వర్గీకరణ అవసరం ఉందని అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో జస్టిస్ త్రివేది తమ ప్రత్యేక సమగ్ర 85 పేజీల తీర్పులో ఉప వర్గీకరణ అంశం కేవలం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఏ ఒక్క కులాన్ని అయినా ఎస్‌సి లిస్ట్‌లో చేర్చడం లేదా మినహాయించడం అనేది పార్లమెంట్ చేపట్టాల్సిన విషయం. దీనిని రాష్ట్రాలు ఏ విధంగా చేపడుతాయి? ఈ అధికారం వాటికి ఉండదని తమ తీర్పులో తెలిపినా, ప్రధాన తీర్పుతో ఆమె ఏకీభవించారు. అయితే ఎస్‌సిలు సారూప్య సమ్మిళిత వర్గం . ఇందులో ఉప వర్గీకరణ అసంబద్ధం అవుతుంది, పైగా రాష్ట్రాలు ఉపవర్గీకరణకు దిగడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని వివరించారు. అయితే ఇంతకు ముందటి తీర్పులను తప్పుపడుతూ అప్పటి తీర్పు ఉప వర్గీకరణ సరైనదే అని రూలింగ్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News