Tuesday, January 28, 2025

ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హతపై షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్‌లో వెల్లడించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు , ఫిరాయింపు ఎంఎల్‌ఎల తరుపున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఇదే కేసులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంఎల్‌ఎల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బిజెపి శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది జే.ప్రభాకర్‌రావు తన వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలు అసెంబ్లీ సమావేశాల్లో, సభ ఓటింగ్‌లో గానీ పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఇంతకు ముందే తోసిపుచ్చింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. బిఆర్‌ఎస్ నుంచి పది మంది ఎంఎల్‌లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.

ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరిల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు ఎంఎల్‌ఎలకు వ్యతిరేకంగా వస్తే వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ముగ్గురే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరారు. ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని కోర్టు తీర్పు ఇస్తే వీరంతా అయోమయంలో పడే అవకాశం ఉంది. ఒక వేళ వీరికి అనుకూలంగా తీర్పు వస్తే మరికొంత మంది బిఆర్‌ఎస్ పార్టీని వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News