న్యాయస్థానాల్లో
మాతృభాష అమలు
యోచనలో కేంద్రం
సినిమా పేర్లు తెలుగులోనే
ఉండాలి ప్రపంచ
తెలుగు సమాఖ్య సభల్లో
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయస్థానా ల్లో వాదనలు, ప్రతివాదనలు, తీర్పులు తెలుగుతో పాటు ప్రాంతీయ భాషల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదని కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షు డు జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ప్ర భుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానంలో మాతృభాషకు పెద్దపేట వేశారని గుర్తుచేశారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు, పరిరక్షించేందుకు కేంద్రం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరుగుతున్న ప్ర పంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మ హాసభల్లో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకురానున్న నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ప్రాథమిక విద్య, ప్రభుత్వ పాలన వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు తెలుగులోనే రావాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. గతంలో సినిమాలకు అద్భుతమైన తెలుగు పేర్లు పెట్టేవారని, అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుందని సూచించారు.
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు మన భాగ్యనగరంలో ఈ మహా సభలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలకు ప్రత్యేకంగా ఇందిరాదత్, వారి బందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష, తెలుగు భాషా సంప్రదాయాలు, కళలను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా తమ సేవలు అందించడం నిజంగా అభినందనీయమని అన్నారు. భారత దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని చెబుతూ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్క-తం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదని, తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాష అని కొనియాడారు. తెలుగు పదాలు, శ్రావ్యంగా వినేవారికి సంగీతాన్ని విన్నట్టు అనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారని ఆవేదన చెందారు.
నిజాం కాలంలో తెలుగుపై వివక్ష
నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగి, ఉర్దూ మాధ్యమంలోనే పాఠశాలలు ఉండేవని అన్నారు. తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేదని, నిర్చందకాండ కొనసాగిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అంత నిర్బంధంలో కూడా నాడు గ్రంథాలయోద్యమం, ’ఆంధ్ర మహాసభ’ పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు. ఇక, యక్షగానం, భాగవతం, నాటకం వంటివి తెలుగు భాషకే ప్రత్యేకమైన కళా రూపాలని, ప్రపంచంలో అవధానం అనేది తెలుగు, సంస్కృతంలో తప్పిస్తే మరే భాషలోనూ కనపడదని అన్నారు. తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాయడం చాలా బాధాకరమని, ఇంట్లో కూడా ఇంగ్లీషులో మాట్లాడే రోజులొచ్చాయని అన్నారు. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలన్ని డిజిటలైజేషన్ చేయాలని తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలని సూచించారు. విద్యార్థులు లేక తెలుగు విద్యా సంస్థలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై మనమంతా ఆలోచించాలని అన్నారు. ప్రస్తుతం వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉందని మిగతా 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయని అన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యేలా ఉందన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కిషన్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు.