చండీగఢ్: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో సుభ్‌కరన్ సింగ్ అనే 21 సంవత్సరాల రైతు ప్రాణాలు కోల్పోయిన రెండు వారాల తర్వాత ఆయన మృతిపై పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం న్యాయ విచారణకు ఆదేశించింది. కొన్ని స్పష్టమైన కారణాల దృష్టా ఈ విచారణను పంజాబ్ లేదా హర్యానాకు అప్పగించరాదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయ విచారణ కోసం హర్యానా, పంజాబ్‌కు చెందిన ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు ఎడిజిపి ర్యాంకు అధికారులతో త్రిసభ్య కమిటీని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధావాలియా, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసింది. పిల్లలను రక్షణ కవచంలా వాడుకుంటున్నారని, ఇది సిగ్గుచేటని ధర్మాసనం మైకికంగా వ్యాఖ్యానించింది.
స్కూలులో చదువుకోవలసిన పిల్లలను వేరే చోట వాడుకుంటున్నారని, అది యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందని ధర్మాసనం పేర్కొంది. శుభ్‌కరన్ సింగ్ మరణం పోలీసు బలగాల దౌర్జన్యంగా కోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులపై ఎటువంటి బుల్లెట్లు, పెల్లెట్లు ఉపయోగించారో చెప్పాలని హర్యానా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పంజాబ్ పోలీసుల అలసత్వాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. ఫిబ్రవరి 21న మరణం సంభవిస్తే ఫిబ్రవరి 28న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని కోర్టు తెలిపింది.