Monday, December 23, 2024

మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడీషీయల్ విచారణ

- Advertisement -
- Advertisement -

హైకోర్టు సిజెకు రేవంత్ సర్కార్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ సర్కార్ మంగళవారం లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణ నిర్వహిస్తామని శాసనమండలిలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 12 చోట్ల విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఇటీవల కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.

విజిలెన్స్ సోదాలు, జ్యుడీషీయల్ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారనే దానిపై గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు టెండర్‌ను ఎలా ఫైనల్ చేశారు? ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే విషయాలపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ నివేదిక, జ్యుడీషీయల్ విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏం జరిగిందనే అంశాలను బయట పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును బిఆర్‌ఎస్ సర్కార్ తెరమీదికి తెచ్చింది. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా ఎందుకు పక్కన పెట్టారనే విషయమై కాంగ్రెస్ సర్కార్ అన్వేషణ ప్రారంభించింది. ఈ విషయమై అప్పటి సర్కార్ చెబుతున్న కారణాలు సహేతుకమైనవేనా? కావా? అనే విషయాలను ఈ విచారణల ద్వారా బయట పెట్టాలని భావిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కెసిఆర్ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అప్పట్లోనే విపక్షాలు విమర్శలు చేశాయి. గత ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందనే విషయాలను అసెంబ్లీలో కూడ ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయమై బిఆర్‌ఎస్ తీరును ఎండగట్టేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. మరో వైపు అసెంబ్లీ బయట కూడ ఈ విషయాలపై బిఆర్‌ఎస్ సర్కార్ తీరును ఎండగట్టాలని ప్రభుత్వం తల పెట్టింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. ఇటీవల మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటించింది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. పరిశీలన అనంతరం ఒక స్తంభం 1.2 మీటర్ల మేర కుంగిపోయినట్లు తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోవడంపై విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టు సిజె నుంచి వచ్చే స్పందనను బట్టి కాళేశ్వరంపై తదుపరి విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News