Friday, November 22, 2024

‘శిథిల’ న్యాయ వ్యవస్థ!

- Advertisement -
- Advertisement -

Judicial system is in state of disrepair

 

రాజ్యసభ సభ్యులు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, పలు కీలక సందర్భాల్లో జాతి దృష్టిని విశేషంగా ఆకర్షించిన న్యాయాధీశుడు జస్టిస్ రంజన్ గొగోయ్. చిరకాలం పాటు పరిష్కారానికి నోచుకోక దాదాపు శీతల గిడ్డంగిలోకి వెళిపోయిందనుకున్న రామజన్మ భూమి బాబరీ మసీదు భూ వివాదానికి పని కట్టుకొని తెర దించిన దీక్షాపరుడు, అక్కడ మహా రామాలయ నిర్మాణానికి దారి వేసిన చరిత్రాత్మక తీర్పు ప్రక్రియకు చోదక శక్తిగా నిలిచిన వారు ఆయన. ఇంకా మరెన్నో సంచలన న్యాయ సందర్భాల మూల పురుషుడు. అటువంటి గొగోయ్ దేశంలో న్యాయ వ్యవస్థ దుస్థితిపై ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనించదగినవి. న్యాయ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకున్నదని,సాధారణ ప్రజల అవసరాలను తీర్చడం మానుకున్నదనే స్పష్టమైన అభిప్రాయం ఆయన మాటల్లో వెల్లడైంది. కోర్టుకు వెళ్లిన మామూలు వ్యక్తులు ఎందుకు వెళ్లామా అని బాధపడుతున్నారని కూడా అన్నారు. కోట్లాది రూపాయల లబ్ధి ఆశించే సంపన్నులు, కార్పొరేట్ శక్తులు మాత్రమే న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి సాహసిస్తున్నారని అన్నారు.

పరిస్థితిని మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు తగిన మార్గపటాన్ని రూపొందించాలని న్యాయ వ్యవస్థ పెద్దలకు సూచించారు. న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న వల్లమాలిన ఆలస్యం కూడా ఇందుకు ఒక కారణమన్నారు. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుల వరకూ పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసుల ప్రస్తావన చేశారు. అధికారం, నోరు ఉన్నవారు న్యాయమూర్తులతో సహా ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారి దాడికి గురై కొంత మంది న్యాయమూర్తులు లొంగిపోతున్నారని కూడా అన్నారు. ఈ మాటలు తన నోటి నుంచి వెలువడడానికి గల కారణాలను ఆయన బయటపెట్టలేదు. కనీసం అటువంటి ఒకటి రెండు సందర్భాలనైనా ప్రస్తావించలేదు. కాని ఈ వ్యాఖ్యలు చేసి జస్టిస్ గొగోయ్ మరొక సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఇటీవల కోల్‌కతాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇలా బయటపడ్డారు. న్యాయమూర్తుల ఎంపిక, శిక్షణ తీరులో కూడా మార్పులు రావాలన్నారు.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనుకుంటున్నాం, అదే సమయంలో శిథిల న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నాం అని ఎత్తి పొడిచారు.

మీపై ఆరోపణలు చేస్తున్న వారి మీద కోర్టులో కేసు వేస్తారా అన్న ప్రశ్నకు కోర్టుకు వెళ్లడమంటే అక్కడ మీ పరువు తీసుకోడమే జరుగుతుంది గాని తీర్పు రాదు అని కూడా అభిప్రాయపడ్డారు. గొగోయ్ వ్యాఖ్యానాల్లో తగినంత మంది న్యాయమూర్తులు, న్యాయస్థానాలు లేక సంవత్సరాలూ, దశాబ్దాల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉండిపోయి జన జీవనం మీద దుష్ప్రభావం చూపుతున్న దుస్థితి పట్ల ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నది. దానినెవరూ కాదనలేరు. చాలా కాలంగా తరచూ చర్చకు వస్తున్న ఈ సమస్య పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో సమూల సంస్కరణలు రావలసిన అవసరాన్ని గొగోయ్ ఆవేదన మరింత ముందుకు తెచ్చింది. న్యాయమూర్తులపై రాజకీయాది ఒత్తిడులు, బెదిరింపులు, ఆ సరళిలో నిందలకు గురి చేయడం వంటివి జరుగుతున్నట్టు అందుకు కొందరు న్యాయమూర్తులు లొంగిపోతున్నట్టు అనుకోడానికి ఆస్కారమిచ్చే వ్యాఖ్యలు కూడా ఆయన నోట వెలువడడం విశేషం. జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ అన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన గొగోయ్ ఈ వ్యాఖ్యల ద్వారా దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన నిజాలను చెప్పాలని ప్రయత్నిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

గొగోయ్ తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సంభవించిన న్యాయ వ్యవస్థ వైఫల్యాలను వెల్లడించి అది ఏయే సందర్భాల్లో వెనుకబడిందో చెబితే బాగుండునని శివసేన ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాసారంభంలో గుజరాత్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ మన న్యాయ వ్యవస్థను వేనోళ్ల పొగిడారని అందుకు విరుద్ధంగా జస్టిస్ గొగోయ్ అది భ్రష్టు పట్టిపోయిందంటున్నారని పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.జస్టిస్ దీపక్ మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమైన రాజకీయ వ్యాజ్యాలను ఆయన తాను ఎంపిక చేసుకున్న కొద్ది ధర్మాసనాలకే కేటాయిస్తున్నారంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహుశా దాని చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శించారు. వారిలో రంజన్ గొగోయ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆ అత్యున్నత పదవిని అలంకరించిన గొగోయ్ రోహింగ్యాలను స్వదేశానికి పంపించి వేయాలనే తీర్పు మీద, అసోంలో వివాదాస్పద పౌరసత్వ జాబితా తయారీకి ఆమోద ముద్ర వేసిన దాని మీద విమర్శలెదుర్కొన్నారు. గతం ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక లోపాలను ఎత్తి చూపినందుకు ఆయనను అభినందించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News