న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు(శనివారం) భారత అత్యున్నత న్యాయస్థానంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. 2015 నుండి… 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ జస్టిస్ క్లాక్‌తో సహా ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద ప్రధాన మంత్రి అనేక కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. వాటిలో ‘JustIS’ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్ మరియు ‘S3WaaS’ వెబ్‌సైట్‌లు వంటివి ఉన్నాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలను తెలియజేస్తూ, 1949లో ఈ రోజున స్వతంత్ర భారతదేశం కొత్త భవిష్యత్తుకు పునాది వేసుకున్నదని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంవత్సరంలో రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రధాన మంత్రి గుర్తించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ ఆయన ఈ సందర్భంగా నివాళులర్పించారు. అందరికీ న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ చర్యలు చేపడుతోందన్నారు.
ప్రస్తుత ప్రపంచ(గ్గోబల్) పరిస్థితిలో, యావత్ ప్రపంచం భారతదేశాన్ని ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ , అంతర్జాతీయ ప్రతిష్టల మధ్య ఆశతో చూస్తోందని ప్రధాన మంత్రి మోడీ గుర్తు చేశారు. ఈ విజయానికి మన రాజ్యాంగం కారణమన్నారు. “ఆధునిక కాలంలో, రాజ్యాంగం దేశం యొక్క అన్ని సాంస్కృతిక , నైతిక భావోద్వేగాలను స్వీకరించింది” అన్నారు. అమృత్‌కాల్‌ను ‘కర్తవ్య కాల’గా పేర్కొంటూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌కాల్‌లో, రాబోయే 25 ఏళ్ల అభివృద్ధి కోసం మనం ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో కర్తవ్యం అనే మంత్రాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. “ఆజాదీ కా అమృత్ కాల్ దేశం పట్ల కర్తవ్యం చెప్పాల్సిన సమయం. ప్రజలు లేదా సంస్థలు కావచ్చు, మన బాధ్యతలే మన మొదటి ప్రాధాన్యత” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘కర్తవ్య మార్గాన్ని’ అనుసరించడం ద్వారా దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోగలదని ఆయన నొక్కి చెప్పారు. “ఆజాదీ కా అమృత్ కాల్‌లో, ఇది దేశానికి అవసరం. ఈ రాజ్యాంగ దినోత్సవం ఈ దిశలో మన తీర్మానాలకు మరింత శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ ప్రధాన మంత్రి ముగించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై. చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ , జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్ పి బాఘెల్. , భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా , సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.