హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీ నుండి పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి అన్నారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని నిండు అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారని, కానీ ప్రస్తుతం కేవలం 4 లక్షల ఎకరాలను 1 లక్షా 80 వేల మంది గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడం సరైంది కాదని సిఎం కెసిఆర్‌కు గురువారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
శాటిలైట్ మ్యాపుల పేరుతో, కొత్తగా సాగు చేశారనే కారణాలతో 4 లక్షల ఎకరాలకు పైగా దరఖాస్తులు చేసు కున్న లక్ష మంది గిరిజనుల దరఖాస్తులను కారణాలు తెలపకుండానే తిరస్కరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఆలోచనకు ఇది విరుద్ధంగా ఉందన్నారు. తిరిగి పోడు భూముల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే 11.50 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించడమే మార్గమని కోరారు.