హైదరాబాద్ : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జిల్లాకు ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. దేశచరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద సంఖ్యలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించలేదని ఇది కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో చేసిన పనిగా చరిత్రలో నిలిచిపోతుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా గురుకుల విద్యావ్యవస్థను నెలకొల్పి రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ పాఠశాలలు 327కి పైగా నెలకొల్పటం విద్యారంగ చరిత్రలో విప్లవమన్నారు. 33 జిల్లాల్లో 33 బీసీ డిగ్రీ కాలేజీలను నెలకొల్పి తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిపోతుందన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలను అమలు చేస్తున్న కేసీఆర్ కు రుణపడి ఉంటామని ఒక బీసీ బిడ్డగా ముఖ్యమంత్రికి రెండు చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు. బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులకు చెందిన బీసీ బిడ్డలు రేపటి అత్యాధునిక ప్రపంచంలో పోటీ పడడానికి ఈ గురుకులాలు పునాదులుగా నిలుస్తాయని చెప్పారు. అన్ని రంగాలను ప్రభావితం చేసే బీసీ జ్ఞాన సూర్యోదయాలు ఈ గురుకులాల నుంచే ప్రభవిస్తాయన్నారు. గొంతులు పెకలించి బీసీ బిడ్డలు ఎంత నినదించినా మా చదువుల మొరను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్న బాధను వ్యక్తం చేశారు. శతాబ్ధకాలంలో ఏ ప్రభుత్వమూ చేయలేని పనిని కేసీఆర్ దశాబ్ధకాలంలో చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల బిడ్డల కోసం 1018 గురుకులాలలను నెలకొల్పటం సంబురాలకే సంబురమయ్యే సంబురమని అభివర్ణించారు.
ఎన్నెన్నో వలపోతలు, తలపోతల నుంచి గట్టెక్కిస్తున్న గురుకులాల్లో చదువుకుంటున్న 1,68,000 మంది బీసీ బిడ్డలకు మరో 17 డిగ్రీ కాలేజీల మంజూరు విద్యాదినోత్సవ తీపికబురుగా సంబురాలు జరుపుకుంటారని తెలిపారు. సహస్ర బీసీ వృత్తుల ఆశీర్వాదంతో కేసీఆర్ సల్లంగుండాలని జూలూరు కోరారు.