Monday, December 23, 2024

కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్‌తో జూలూరు భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు సాహిత్య ప్రముఖుల శతజయంతి ఉత్సవాల నిర్వహణ, తెలుగు భాషకు సంబంధించిన జాతీయ సెమినార్లలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి జానపద సాహిత్యం పై తొలి పిహెచ్‌డి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల జాతీయ సెమినార్‌ను నిర్వహించ తలపెట్టామని అందులో భాగస్వాములు కావాలని కేంద్ర సాహిత్య అకాడమి జనరల్ కౌన్సిల్‌ను కోరారు.

కేంద్ర సాహిత్య అకాడమి జనరల్ కౌన్సిల్ సభ్యులు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేయబోయే సాహిత్య కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు సాహిత్యాన్ని ఈ తరం వారి దగ్గరకు తీసుకుపోయేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందుకు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కేంద్ర సాహిత్య అకాడమి జనరల్ కౌన్సిల్ నూతన కార్యవర్గం తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొ. సి. మృణాళిణి, జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, ప్రసేన్ మందలపర్తి కిషోర్ లను తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మెన్ జూలూరు గౌరీ శంకర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమి కార్యదర్శి ఎన్. బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News