Sunday, December 22, 2024

జులై జిఎస్‌టి వసూళ్లు రూ.1.65 లక్షల కోట్ల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జులై నెలలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు వచ్చాయి. ఎగవేత నియంత్రణ చర్యలు, అధిక వినిమయ ఖర్చులతో ఈసారి జిఎస్‌టి ఆదాయం గణనీయంగా పెరిగింది. వరుసగా ఐదోసారి నెలవారి జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, జులైలో జిఎస్‌టి రూ.1,65,105 కోట్లు వసూలు కాగా, వార్షిక ప్రాతిపదికన ఇది 11 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2022 జూలైలో ఇది రూ.1,48,995 కోట్లుగా ఉంది. అంతకుముందు 2023 జూన్‌లో రూ.1,61,497 కోట్లుగా ఉంది. అయితే ఇప్పటి వరకు అత్యధిక జిఎస్‌టి 2023 ఏప్రిల్‌లో రూ. 1.87 లక్షల కోట్లు వచ్చింది. అయితే దేశ జిఎస్‌టి వసూళ్లు వరుసగా 17 నెలలుగా రూ.1.4 లక్షల కోట్లకు పైనే నమోదయ్యాయి. ఎన్.ఎ.షా అసోసియేట్స్ పాట్నర్, పరోక్ష పన్ను, పరాగ్ మెహతా మాట్లాడుతూ, గృహాలు, కార్లు, పర్యటనలు, ఇతర వినిమయ వస్తువులకు అధికంగా ఖర్చు చేయడం వల్ల నెలవారీ జిఎస్‌టి ఆదాయం పెరిగిందని అన్నారు. జిఎస్‌టి అనేది పరోక్ష పన్ను, ఇది 2017లో అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న వివిధ రకాల పరోక్ష పన్నులు (వ్యాట్), సేవా పన్ను, కొనుగోలు పన్ను, ఎక్సైజ్ సుంకం, అనేక ఇతర పరోక్ష పన్నుల స్థానంలో ఈ జిఎస్‌టిని అమల్లోకి తీసుకొచ్చారు. జిఎస్‌టిలో 5, 12, 18, 28 శాతం నాలుగు శ్లాబులు ఉన్నాయి.

తెలంగాణ జిఎస్‌టి వసూళ్లు రూ.4,849 కోట్లు
2023 జులైలో తెలంగాణ జిఎస్‌టి వసూళ్లు రూ.4,849 కోట్లతో వార్షికంగా 7 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే సమయంలో రాష్ట్ర వసూళ్లు రూ.4,547 కోట్లు నమోదయ్యాయి. జులై జిఎస్‌టి వసూళ్లలో మహారాష్ట్ర టాప్- 5 రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర జిఎస్‌టి వసూళ్లు గతేడాది కంటే 18 శాతం పెరిగి రూ.26,064 కోట్లుగా ఉన్నాయి. ఈ జాబితాలో రూ.11,505 కోట్ల వసూళ్లతో కర్నాటక రెండో స్థానంలో ఉంది. ఇక రూ. రూ.10,022 కోట్ల వసూళ్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.

2023-24లో జిఎస్‌టి వసూళ్లు

నెల జిఎస్‌టి వసూళ్లు
ఏప్రిల్ రూ.1.87 లక్షల కోట్లు
మే రూ.1.57 లక్షల కోట్లు
జూన్ రూ.1.61 లక్షల కోట్లు
జూలై రూ.1.65 లక్షల కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News