- Advertisement -
న్యూఢిల్లీ: పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాను అందించడానికి తుది గడువును జూన్ 30గా నిర్ణయించినట్టు సిబిఎస్ఇ ప్రకటించింది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నది. గత ఆదేశాల ప్రకారం జూన్ 11ను మార్కుల జాబితా సమర్పణకు తుది గడువుగా నిర్ణయించి, ఫలితాలను 20న వెల్లడిస్తానని సిబిఎస్ఇ తెలిపింది. కొవిడ్ రెండో ఉధృతి కారణంగా ఈ ఏడాది నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఏప్రిల్ 14న సిబిఎస్ఇ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల మార్కుల జాబితా రూపొందించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాలలకు గతంలోనే సిబిఎస్ఇ సూచించింది. ప్రస్తుత విధానం ప్రకారం విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులను అంతర్గత మదింపు ద్వారా 20 శాతం, ఏడాది పొడవునా నిర్వహించిన పరీక్షల్లో వారు పొందిన మార్కుల ఆధారంగా 80 శాతం ఇస్తారు.
- Advertisement -