సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లదే హవా
10 నుంచి 13 ఏళ్లుగా ఒకేచోట విధుల నిర్వహణ
బదిలీలు చేపట్టని ప్రభుత్వం
ఇన్‌చార్జీలుగా అవకాశం కల్పిస్తే అందినకాడికి…..
డాక్యుమెంట్ రైటర్‌లతో కలిసి చేతివాటం చూపిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చెప్పిందే వేదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది 10 నుంచి 13 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తుండడంతో వారు సబ్ రిజిస్ట్రార్‌లను శాసిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌ల బదిలీలు లేకపోవడం, స్థానికంగా జరిగే క్రయ, విక్రయాలపై వారికి పూర్తిగా అవగాహన ఉండడంతో వారు చెప్పిందే వేదంగా సబ్ రిజిస్ట్రార్‌లు నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొందరి అవినీతి వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సబ్ రిజిస్ట్రార్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలా ఏళ్లుగా ఒకే చోట విధులు …
దీంతోపాటు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్‌లు సెలవు వెళ్లిన సమయంలో ఇన్‌చార్జీలుగా వ్యవహారిస్తున్న కొందరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లు నిబంధనలను విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తుండడం విశేషం. ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో వారు చేసిన రిజిస్ట్రేషన్‌లపై ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం విచారణ చేపట్టడం గమనార్హం. చాలా ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహించడం వల్ల అవినీతి పెరిగిపోతుందని వారిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి గతంలోనే ఏసిబి సైతం నివేదిక సమర్పించడం విశేషం.
ప్రస్తుతం మేడ్చల్ పరిధిలో ఒక సీనియర్ అసిస్టెంట్‌కు సబ్ రిజిస్ట్రార్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించడంతో అక్రమ లే ఔట్‌లకు రిజిస్ట్రేషన్‌లు చేసినట్టుగా ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఖిలా వరంగల్‌కు చెందిన సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జీగా ఉన్న సబ్ రిజిస్టార్ రాజేష్ 48 గంటల్లో 26 అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేయడంతో ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంది.
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటం అధికం…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటం అధికంగా ఉంటుందని, వీరి వల్లే కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు ఇబ్బందులు సైతం ఎదురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఔట్‌సోర్సింగ్ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్స్‌తో కలిసి అవినీతి పాల్పడుతున్నారని దానివల్ల సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిపరులన్న ఆరోపణలు వస్తున్నాయని కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.