మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) 155 క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో ఇప్పటికే వర్కర్లుగా పనిచేస్తున్న అర్హులైన బడ్డీ వర్కర్లు, ఇతర కేటగిరీలకు చెందిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుండగా జూన్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నింపిన దరఖాస్తుల హార్డు కాపీలను జూన్ 25 లోపు సంబంధిత రిక్రూట్‌మెంట్ సెల్‌కు పంపించాలని సింగరేని యాజమాన్యం తెలిపింది.
భర్తీ చేయనున్న 155 పోస్టుల్లో 95 శాతం పోస్టులను సింగరేణి పనులు జరుగుతున్న 4 జిల్లాల్లోని ఇన్ సర్వీస్ ఉద్యోగులకు, మిగిలిన 5 శాతం పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతున్న అభ్యర్థుల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలో 85 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 15 మార్కులకు అసెస్‌మెంట్ నివేదిక ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
అండర్ గ్రౌండ్ వర్కర్లలో ఏడాదికి 190 మస్టర్లు పూర్తి చేసిన వారు, ఉపరితల (surface workers) వర్కర్లలో ఏడాదికి 240 మస్టర్లు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సర్టిఫికేషన్‌తో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్స్ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. ఆరు నెలల సర్టిఫికేషన్‌తో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్‌లో డిప్లమా కోర్సు చేసి ఉండాలని సింగరేణి తెలిపింది.